హైదరాబాద్: తెలంగాణలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈమేరకు కేంద్రం రూ.387.53 కోట్లు ఇచ్చింది. తెలంగాణలోని పంచాయతీలకు కొత్త సర్పంచ్‌లు రావడంతో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ… దశలవారీగా నిధులను విడుదల చేయడం ప్రారంభించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో మొదటి విడతగా కేంద్రం ఫిబ్రవరి 5న రూ.259.36 కోట్లు విడుదల చేసింది. దీని తర్వాత ఫిబ్రవరి 12న రెండవ విడత రూ.387 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా మూడో దశలో శుక్రవారం రోజున రూ.387.53 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు గ్రామపంచాయతీలకు మొత్తం రూ.1033.89 కోట్లు విడుదల చేసినట్టుగా అయింది.
గత డిసెంబర్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఇప్పటివరకు రూ.1,034.42 కోట్లకు చేరుకుంది. అయితే, దాదాపు రూ.2,000 కోట్ల బకాయిలు కేంద్రం నుండి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గ్రామాలలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.
ఈ గ్రాంట్లను ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, గ్రామ అంతర్గత రోడ్ల మరమ్మత్తు, నిర్వహణ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగించనున్నారు. అధికారుల ప్రకారం…పెండింగ్ నిధుల విడుదలలో జాప్యం గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అభివృద్ధి పనుల వేగాన్ని ప్రభావితం చేసింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క శుక్రవారం కేంద్రాన్ని మిగిలిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు, గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరంతరాయంగా అమలు కావడానికి సకాలంలో నిధుల లభ్యత అవసరమని పేర్కొన్నారు.
