హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని ఖరారు చేసే ముందు దానిని ప్రజాక్షేత్రంలో ఉంచాలని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ డిమాండ్ చేసింది. విధాన నిర్ణయాలను ఖరారు చేసే ముందు కమిషన్లు, కమిటీలు… ప్రజా చర్చ కోసం ముసాయిదా నివేదికలను విడుదల చేయడం చాలా కాలంగా ఉన్న ప్రజాస్వామ్య సంప్రదాయమని కమిటీ పేర్కొంది.
సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్‌ను నియమించింది. ఇటీవల, కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమర్పించిన విషయం తెలిసిందే.
ఈమేరకు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ నాయకులు కె చక్రధరరావు, జి హరగోపాల్,కె లక్ష్మీనారాయణ, ప్రభుత్వం నివేదికను కనీసం మూడు నెలల పాటు ప్రజాక్షేత్రంలో ఉంచాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కమిటీ జాతీయ విద్యా విధానం మోడల్‌ను ఉదహరించింది. దేశవ్యాప్తంగా చర్చ కోసం దీని ముసాయిదా పత్రం విడుదల చేసారు. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థుల నుండి సూచనలు ఆహ్వానించారు. సంప్రదింపుల ప్రక్రియ దాదాపు రెండు సంవత్సరాలు కొనసాగిందని సేవ్ ఎడ్యుకేషన్ నేతలు పేర్కొన్నారు.
ఈ పూర్వాపరాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ విద్యా కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని, నిర్మాణాత్మక సూచనలు, విమర్శలను చేర్చిన తర్వాత మాత్రమే దానిని ఖరారు చేయాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. నివేదికకు తుది రూపాన్ని ఇచ్చే ముందు కనీసం మూడు నెలల పాటు బహిరంగ చర్చకు సమయం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

