Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడి… ప్రధాని మోదీ మౌనాన్ని విమర్శించిన విపక్షాలు!

Share It:

న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా జరిరిపిన దాడిపై నరేంద్ర మోదీ మౌనం వహించడం, ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్యపై ప్రధానమంత్రి సంతాపం ప్రకటించకపోవడంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇరాన్ నాయకుడి హత్యపై ప్రభుత్వం మౌనంగా ఉండటం తటస్థం కాదని; అది ఒక పరాజయం అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఒక వ్యాసంలో సోనియా గాంధీ అన్నారు.

ఓవైపు చర్చలు కొనసాగుతున్న తరుణంలో… ఒక దేశాధినేతను చంపడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతను సూచింస్తుంది. ఈ సంఘటన పెద్ద షాక్‌ అనుకుంటే న్యూఢిల్లీ మౌనం కూడా అంతకంటే ఎక్కువని ఆమె వ్యాఖ్యానించింది, ఈ అంశంపై ప్రధాని మోదీ మౌనాన్ని విమర్శించింది.

యుఎఇపై ఇరాన్ ప్రతీకార దాడిని ప్రధాని ఖండించారని, అయితే ఆయతుల్లా ఖమేనీ హత్యను ఖండించలేదని సోనియా అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంలో భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ఆమె ప్రశ్నించారు. “ఒక విదేశీ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని హత్య చేసినపుడు దానిని ఖండించకపోవం…మన విదేశాంగ విధానం విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతుంది” అని సోనియా గాంధీ అన్నారు.

ఈ విషయంలో మౌనం ఉండటం అంటే తటస్థంగా ఉండడం కాదని ఆమె అన్నారు. “ఈ హత్య అధికారికంగా యుద్ధ ప్రకటన లేకుండా, దౌత్య ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో జరిగింది” అని కూడా ఆమె ఎత్తి చూపారు.
అంతేకాదు ఇజ్రాయెల్ దళాలు గాజాలో పాలస్తీనియన్ల మారణహోమాన్ని కొనసాగిస్తున్నప్పుడు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మద్దతు ఇవ్వడం పట్ల మోడీ నిబద్ధతను కూడా ఆమె విమర్శించారు. రష్యా, చైనా వంటి ప్రధాన శక్తులు ఇజ్రాయెల్ నుండి దూరంగా ఉన్నప్పుడు, “భారతదేశం వైఖరి ఈ విషాదానికి నిశ్శబ్ద ఆమోదాన్ని సూచిస్తోంది” అని సోనియా గాంధీ అన్నారు.

ఇరాన్‌తో భారతదేశ సంబంధాలు వ్యూహాత్మకమైనవి అని కాంగ్రెస్ నేత అన్నారు. 1994లో, కాశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్‌లోని విభాగాలు తీర్మానాన్ని తీసుకువచ్చినప్పుడు, ఇరాన్ దానిని నిరోధించడం ద్వారా ముఖ్యమైన పాత్ర పోషించిందని ఆమె గుర్తు చేశారు. ఇరాన్ జోక్యం కాశ్మీర్ సమస్య అంతర్జాతీయీకరణను సున్నితమైన సమయంలో నిరోధించిందని ఆమె అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇరాన్‌పై దాడి, ఖమేనీహత్యపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టారు. ఒక దేశాధినేత హత్యకు ప్రధాని మోడీ మద్దతు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ మౌనం ఇప్పుడు ప్రపంచంలో భారతదేశ స్థాయిని తగ్గించిందని రాహుల్ గాంధీ అన్నారు. “ప్రధాని మోడీ ఇప్పుడు మాట్లాడాలి” అని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ… “భద్రతాపరమైన సమస్యలు వాస్తవమే అయినప్పటికీ, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని అన్నారు. ఇరాన్‌పై ఏకపక్ష దాడులు, అలాగే ఇతర మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాలి. హింస హింసను పుట్టిస్తుంది – చర్చలు జరపడం, సంయమనం పాటించడమే శాంతికి ఏకైక మార్గం అని రాహుల్‌ అన్నారు.”

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రధాని మోడీ విదేశాంగ విధాన వైఖరి సరికాదన్నారు. ఇరాన్‌పై అమెరికా/ఇజ్రాయెల్ సంయుక్త దాడిని, ఖమేనీ హత్యను ఖర్గే ఖండించారు. ఖమేనీని లక్ష్యంగా చేసుకుని హత్య చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ద్వంద్వంగా ఖండించింది. “సార్వభౌమత్వం షరతులతో కూడినది కాదు, రాజకీయ చట్టబద్ధతను బలవంతంగా తయారు చేయలేము” అని ఖర్గే అన్నారు.

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ హత్యను ఖండించారు. ఈ ఉద్రిక్తత పశ్చిమాసియా అంతటా అస్థిరత భయాలను పెంచిందని, ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా జెనీవాలో దౌత్య చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్‌పై జరిగిన దాడులు “అనైతికమైనవి, అనుచితమైనవి” అని ఆయన అన్నారు.

CPI, CPI (M), CPI (ML), CPI ML (లిబరేషన్), CPI ML (న్యూ డెమోక్రసీ), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్), మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్), ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సహా పది వామపక్ష పార్టీల నాయకులు ఇరాన్‌ఫై అమెరికా – ఇజ్రాయెల్ దాడిని ఖండించారు. ఈ పార్టీల నాయకులు మార్చి 3న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, మార్చి 2న విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.