శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు. ఈ హఠాత్పరిణామాన్ని ఆయన పార్టీ ఒక పెద్ద భద్రతా లోపంగా అభివర్ణించింది.
ఈమేరకు జమ్మూలోని పురానీ మండి నివాసి కమల్ సింగ్ జామ్వాల్ అనే అనుమానితుడిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 సంవత్సరాలుగా అబ్దుల్లాను చంపాలని తాను ప్లాన్ చేస్తున్నానని అతను దర్యాప్తుదారులకు చెబుతున్నట్లు ఒక వీడియో చూపించింది.
కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అబ్దుల్లా, ఈ సంఘటన జరిగినప్పుడు జమ్మూలో జరిగిన వివాహ కార్యక్రమానికి J&K ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, J&K ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సలహాదారు నాసిర్ సోగామితో కలిసి హాజరయ్యారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
జమ్మూ శివార్లలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని రాయల్ పార్క్‌లో వివాహ వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన CCTV కెమెరా నుండి తీసిన వీడియోలో, అనుమానితుడు జామ్వాల్ తన జేబులో నుండి ఆయుధాన్ని తీసి, అబ్దుల్లా, అతని సహచరుల వైపు దూసుకుపోతున్నట్లు చూపిస్తుంది, వారు వేడుక నుండి బయటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
జామ్వాల్ తన రివాల్వర్‌తో అబ్దుల్లా తలపై వెనుక నుండి కొట్టడం చూడవచ్చు, కానీ ట్రిగ్గర్‌ను నొక్కలేకపోయాడు. వెంటనే, భద్రతా సిబ్బంది అతన్నిపట్టుకున్నారు.
కాగా, ఈ సంఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. “దేవుడు దయ వల్ల మా తండ్రి తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పని లేదు, కానీ లోడ్ చేసిన పిస్టల్‌తో ఒక వ్యక్తి అతని దగ్గరగా వచ్చి కాల్పులు జరిపాడని మాకు తెలుసు. భద్రతా బృందం బుల్లెట్‌ను అడ్డగించి, హత్యాయత్నాన్ని భగ్నం చేసింది. ప్రస్తుతం, సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, వాటిలో ఒకటి Z+ (NSG) భద్రతా దళాల రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఒకరు ఎలా దగ్గరగా వెళ్ళగలిగారు అనేది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది” అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు D.S. చౌహాన్ కుమార్తె వివాహానికి హాజరు కావడానికి అబ్దుల్లా, ఇతరులు వచ్చారని ప్రత్యక్ష సాక్షి…నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్త వేదిక వెలుపల విలేకరులతో అన్నారు.
“మేము అబ్దుల్లా వెనుక నడుస్తున్నప్పుడు, అతను (జమ్వాల్) డాక్టర్ సాహెబ్ (అబ్దుల్లా) తలపై రివాల్వర్‌తో కొట్టడాన్ని నేను చూశాను. భద్రతా సిబ్బంది సరిగ్గా సమయానికి అతని చేతిని పక్కకు లాగారు, దాంతో ఆ కాల్పులు గాలిలోకి జరిగాయి. దేవుడే ఆయన్ని కాపాడాడు, లేకపోతే ఆ ప్రదేశంలో పోలీసు సిబ్బంది ఎవరూ లేరు,” అని ఆ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
జమ్వాల్ ఒక హిందూ మితవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడని అతను ఆరోపించాడు. “అతను ఒక సంఘీ. అతను (ఇంతకుముందు ఎవరికీ తెలియని) ‘జాగరణ్ మంచ్’కు కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు,” అని అతను చెప్పాడు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అబ్దుల్లాపై కాల్పులు జరపడానికి ఉపయోగించిన .32 రివాల్వర్‌ను అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని జమ్మూ సౌత్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ శర్మ తెలిపారు. “అది లైసెన్స్ కలిగిన ఆయుధం. గంగ్యాల్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసాం. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి,” అని శర్మ చెప్పారు.
అదుపులోకి తీసుకున్న తర్వాత, విఫలమైన ఈ హత్యాయత్నం వెనుక ఉన్న ఉద్దేశం గురించి పోలీసులు జమ్వాల్‌ను ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ విచారణ వీడియోలో, జమ్వాల్ ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా కుర్చీలో హాయిగా కూర్చుని, తన గురించిన వివరాలను పంచుకోవడం కనిపించింది.
“గత ఇరవై ఏళ్లుగా నేను ఫరూక్ అబ్దుల్లాను చంపడానికి ప్రయత్నిస్తున్నాను,” అని జమ్వాల్ విచారణ అధికారులతో చెప్పడం ఆ వీడియోలో వినిపించింది. “ఆయన్ని చంపడమే నా వ్యక్తిగత లక్ష్యం (mission). ఈ రోజు నాకు ఆ అవకాశం దొరికింది, కానీ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. నా దగ్గర ఒక వ్యక్తిగత ఆయుధం ఉంది, కాల్పులు జరపడానికి నేను దాన్నే ఉపయోగించాను.”
కాల్పులు జరిగిన సమయంలో జమ్వాల్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం; అయితే, ఈ ఘటన జరిగిన వివాహ వేడుకకు తనను ఆహ్వానించారని అతను విచారణ అధికారులతో చెప్పడం కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. “నేను ఎక్కడా ఉద్యోగం చేయడం లేదు. నాకు రెండు మూడు దుకాణాలు ఉన్నాయి, వాటిని నేను అద్దెకు ఇచ్చాను. అదే నా ఏకైక ఆదాయ వనరు,” అని అతను విచారణ అధికారులతో చెప్పాడు.
భద్రతా వైఫల్యం జరిగిందన్న ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి చౌదరి పోలీసుల నుండి వివరణ కోరారు.
“మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,(జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రికి) సలహాదారు వంటి ప్రముఖులు ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు, ఒక వ్యక్తి తుపాకీతో ఆ వేదికలోకి ప్రవేశించగలిగాడంటే… అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఎవరైనా ఊహించవచ్చు. ఇది చాలా తీవ్రమైన భద్రతా వైఫల్యం,” అని ఆయన ఆ వేదిక బయట విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. NC నాయకుల ఆరోపణలపై J&K పోలీసులు ఇంకా స్పందించలేదు.
అబ్దుల్లా సురక్షితంగా ఉన్నారని సోగామి అన్నారు, “దర్యాప్తు జరుగుతోంది. ఎటువంటి నిర్ధారణలకు రావడం చాలా తొందరగా ఉంది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు”.
“ఈరోజు జమ్మూలో మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సాబ్ మరియు ఇతర సీనియర్ నాయకులపై జరిగిన దిగ్భ్రాంతికరమైన కాల్పుల సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని J&K కాంగ్రెస్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా Xలో పోస్ట్ చేసారు. ఇటువంటి హింసాత్మక చర్యలు తీవ్ర కలత చెందుతున్నా. ఈ ప్రాంతంలో ప్రస్తుత భద్రతా పరిస్థితి గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయని ఆయన వాపోయారు.”
కాశ్మీర్ ప్రధాన మతాధికారి మిర్వైజ్ ఉమర్ ఫరూక్ కూడా ఈ దాడిని ఖండిస్తూ దర్యాప్తుకు పిలుపునిచ్చారు.

