భువనేశ్వర్: ఒడిశాలో ఘోర విషాదం సంభవించింది. కటక్ SCB మెడికల్ కాలేజీ ఐసియులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం పది మంది రోగులు మరణించారని, 11 మంది సిబ్బందికి గాయాలు అయ్యాయని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు.
కాగా, ఈ తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ట్రామా కేర్ విభాగంలోని మొదటి అంతస్తులో ఉన్న ఐసీయూలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్న రోగులు ఊపిరి ఆడక మరణించారు
ట్రామా కేర్, పక్కనే ఉన్న ఐసియులో 23 మంది రోగులు ఉన్నారని, అగ్నిప్రమాదంలో ఏడుగురు రోగులు మరణించారని, మరో ముగ్గురు తరలింపు సమయంలో కాలిన గాయాలు,ఊపిరాడక మరణించారని సీఎం చెప్పారు. “ఈ సంఘటనలో మొత్తం 10 మంది రోగులు మరణించారు” అని మాఝీ విలేకరులతో అన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని ఆయన అన్నారు.
ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి మాఝి ప్రకటించారు. ఈ విషయంపై విచారణ జరిపి వెంటనే తనకు నివేదించాలని డిజి, అగ్నిమాపక శాఖను కోరారు.
అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత మంటలను ఆర్పారని అధికారి తెలిపారు.
ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, రోగుల సహాయకులతో కలిసి అగ్నిమాపక శాఖ అధికారులు ఐసియులో చికిత్స పొందుతున్న రోగులను రక్షించి, SCB ఆసుపత్రిలోని ఇతర విభాగాలకు తరలించారు.
ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్తో కలిసి మాఝి ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న రోగులను కూడా ఆయన పరామర్శించారు. “గాయపడిన రోగులు, సిబ్బందికి సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను నేను ఆదేశించాను” అని ఆయన అన్నారు.
మృతులు 25 లక్షల ఎక్స్-గ్రేషియా
అగ్నిప్రమాదంలో 10 మంది రోగులు మరణించడం పట్ల ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
