హైదరాబాద్: ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక స్థాయి పిల్లల్లో ఉన్న పోషకాహార లోపాలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈమేరకు’కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ’ (CURE) పరిధిలోని 29 ప్రభుత్వ పాఠశాల సముదాయాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు గాను ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ సూచించిన సిఫార్సులను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి ప్రాంగణంలో మురళీధరన్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలోని 0 నుండి 10 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో ఉన్న పోషకాహార లోపాలు, అభ్యాస సామర్థ్యాల్లోని అంతరాలపై వారు చర్చించారు.
చిన్నతనంలోనే పోషకాహార లోపాల వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలను, అలాగే ప్రాథమిక స్థాయిలో సరైన సంరక్షణ లభించకపోతే విద్యార్థులు తమ తర్వాతి జీవితంలో ఎదుర్కోబోయే మానసిక ఒత్తిళ్లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సవాళ్లను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు.
ఈ నిర్దిష్ట సమస్యలపై తాము ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి మురళీధరన్‌కు తెలియజేశారు. మధ్యాహ్న భోజనంతో పాటు, పాఠశాలల్లో అల్పాహారం (breakfast) అందించేందుకు కూడా బడ్జెట్ కేటాయింపులు చేశామని ఆయన వివరించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయకులతో పాటు, పిల్లలకు పౌష్టికాహారం అందించే పని కోసమే ప్రత్యేకంగా మరొక అదనపు సిబ్బందిని నియమించాలని కూడా మురళీధరన్ సూచించారు.
అంగన్వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గాను, “పోషణ సఖి” పేరుతో ఒక అదనపు వ్యక్తిని నియమించే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఈ విషయమై మురళీధరన్‌తో సంప్రదించి, ఒక సమగ్ర నివేదికను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
