Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

నేటి నుంచి జనగణన తొలిదశ!

Share It:

న్యూఢిల్లీ: జనగణనకు వేళైంది. నేడు దేశ వ్యాప్తంగా తొలిదశ ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఆరునెలలపాటు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. తదుపరి దశ – జనాభా గణన – వచ్చే ఏడాది మార్చి 1 నుండి ప్రారంభమవుతుంది.

కాగా, తుది గణనకు తొలి దశ ఒక ఫ్రేమ్‌వర్క్‌గా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో 31లక్షల ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్లు, లక్షమందికి పైగా జనగణన సిబ్బంది పాల్గొంటారు.

నేటి నుంచి ప్రారంభమయ్యే గృహ గణన సందర్భంగా సాధారణ జన గణన సంబంధిత సందేహాలు, స్వీయ గణనకు సంబంధించిన ప్రశ్నలు సహా అనేక రకాల అంశాలను ఎఫ్‌ఏక్యూలు ప్రస్తావించాయి. అదనంగా ఇంటి ఫ్లోరింగ్‌, రూఫ్‌లో ఉపయోగించే పదార్థాలు, కుటుంబంలో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, కుటుంబ యజమాని జెండర్‌, వినియోగించే ధాన్యాల రకాలు, ప్రాథమిక, ఆధునిక సౌకర్యాల లభ్యత, సొంతంగా కలిగి ఉన్న వాహనాల రకాలకు సంబంధించిన ప్రశ్నలకు వివరణలను పోర్టల్‌ అందచేస్తుంది.

అంతేకాదు కుటుంబ జీవన పరిస్థితులు, ప్రాథమిక సౌకర్యాల లభ్యత గురించిన వివరాలను తెలుసుకుంటారు. అలాగే ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి, దానిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు, అందులో నివసిస్తున్న వ్యక్తుల సంఖ్య (ఏదైనా ఉంటే), భవన యాజమాన్య వివరాలు, గదుల సంఖ్య వంటి వివరాలను అడుగుతారని భారత జనాభా గణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు.

తాగునీటి లభ్యత, విద్యుత్ వనరు, మరుగుదొడ్డి సౌకర్యం, వ్యర్థాల నిర్వహణ, అలాగే ప్రాథమిక వంట ఇంధనంగా ఉపయోగించే గ్యాస్ కనెక్షన్ల రకం వంటి సౌకర్యాల సమాచారాన్ని కూడా గణన అధికారులు సేకరిస్తారని ఆయన అన్నారు. అదేవిధంగా ఇంటి యాజమాన్య హోదాకు సంబంధించి ఒక వ్యక్తి అద్దె ఇంట్లో నివసిస్తూ భారతదేశంలో వేరే చోట సొంత ఆస్తిని కలిగి ఉంటే అది వారి తల్లిదండ్రుల ఇల్లు అయినా లేదా వారు కొనుగోలు చేసిన ఇల్లు అయినా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు కాని వేరే చోట సొంత ఇల్లు ఉంది అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ప్రజల వద్ద రేడియోలు లేదా టెలివిజన్ల వంటి వస్తువులు ఉన్నాయా, వారి ఇంటర్నెట్ సదుపాయం (కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల వివరాలు), రిజిస్టర్ అయి ఉన్న నాలుగు లేదా రెండు చక్రాల వాహనాల గురించి కూడా అడుగుతారు. ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో హెచ్‌ఎల్‌ఓలు (HLO) ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు వ్యవధిలోగా సమర్పించినట్లయితే, 16 భాషలలో అందుబాటులో ఉన్న ఫారాల ద్వారా కూడా సమాధానాలను సమర్పించవచ్చు.

మొత్తం డేటాను సేకరించడానికి, ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొబైల్ ఫోన్ యాప్‌లను ఉపయోగిస్తారు. ఈ యాప్‌లు ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ పరికరాల కోసం అందుబాటులో ఉన్నాయి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా పనిచేస్తాయి. నమోదు చేసిన డేటా అత్యంత గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం తెలిపింది.

అలాగే జనగణన 2027లో భాగంగా ప్రజలు తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ సౌకర్యం నేటి నుంచి ఆగస్టు 31 మధ్య 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ఈ గడువు మారుతూ ఉంటుంది.

కాగా, గృహ గణన కార్యక్రమం తెలంగాణలో మే 11 నుంచి జూన్‌ 9 వరకు, ఏపీలో మే 1 నుంచి 30 వరకు జరుగుతుంది. దీనికి 15 రోజుల ముందు నుంచి సెల్ఫ్‌ ఎన్యూమరేటర్‌ పోర్టల్‌లో ప్రజలు తమ గృహ సంబంధ వివరాలను స్వయంగా నమోదు చేయొచ్చు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీడాక్‌ అభివృద్ధి చేసిన మొబైల్‌ యాప్‌ ద్వారా మొత్తం 16 భారతీయ భాషల్లో వివరాల నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు గానూ 16 సంఖ్యల ఐడిని రూపొందిస్తారు. రెండో దశకు ప్రశ్నలు కొద్ది మాసాల్లో నోటిఫై చేస్తారు. ఈ దశలో కుల గణన కూడా వుంటుంది. ఈసారి జనగణన 2027 పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగనుంది.

భారతదేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. చివరి జన గణన 2011లో జరిగింది. 2021లో కోవిడ్‌ మహమ్మారి కారణంగా దీనిని రద్దు చేశారు. సమర్థవంతమైన విధాన రూపకల్పన కోసం జనాభా, సామాజిక-ఆర్థిక సమాచారం యొక్క కచ్చితమైన, తాజా లెక్కలు అవసరమని వాదిస్తూ, 2027లో జనాభా లెక్కలు నిర్వహించాలని ప్రతిపక్షాలు ఒత్తిడి చేశాయి.

ఇక సమగ్ర కుల ఆధారిత గణనను బ్రిటిష్ వారు 1881, 1931 మధ్య నిర్వహించారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత నిర్వహించిన అన్ని జనాభా గణన కార్యకలాపాల నుండి కులాన్ని మినహాయించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.