వాషింగ్టన్: ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను భారీగా దెబ్బతీసేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఇరాన్ ఓడరేవులను పూర్తిగా దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఇది ఈరోజు రాత్రినుంచి ప్రారంభమవుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి.
ఇరాన్ పోర్టులను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలకు ఇది వర్తిస్తుందని సెంట్‌కామ్ స్పష్టం చేసింది. అయితే, ఇరానేతర పోర్టులకు వెళ్లే నౌకల రాకపోకలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదని, స్వేచ్ఛా నౌకాయానానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఇరాన్‌కు “అక్రమ టోల్” చెల్లించే ఏ నౌకనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డగిస్తామని సోషల్ మీడియాలో ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు.
దిగ్బంధనం ప్రారంభానికి ముందు వాణిజ్య నావికులకు అధికారిక నోటీసు ద్వారా అదనపు సమాచారం జారీ చేస్తామని కూడా అది జోడించింది. అంతేకాదు
ఒమన్ గల్ఫ్‌లో, హర్ముజ్ జలసంధికి సమీపంలో పనిచేస్తున్నప్పుడు, నావికులకు నోటీసు ప్రసారాలను పర్యవేక్షించాలని, బ్రిడ్జ్-టు-బ్రిడ్జ్ ఛానల్ 16 ద్వారా అమెరికా నావికా దళాలను సంప్రదించాలని సూచించారు.
బెదరింపులకు భయపడమన్న ఇరాన్
అమెరికా చర్యలపై ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ట్రంప్ బెదిరింపులకు భయపడబోమని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఖర్ ఖలీబాఫ్ అన్నారు. అమెరికా చర్యల వల్ల పెరిగే ఇంధన ధరలను చూసి త్వరలో అమెరికన్లు బాధపడతారని ఆయన ఎద్దేవా చేశారు.
కాగా, ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చల సందర్భంగా, తన అణు ఆశయాలను వదులుకోవడానికి ఇరాన్ నిరాకరణకు ప్రతిస్పందనగా, హర్ముజ్ జలసంధిపై అమెరికా నావికా దిగ్బంధనాన్ని విధించాలని ట్రంప్ ఇంతకుముందు ఆదేశించారు.
“దిగ్బంధనం త్వరలో ప్రారంభమవుతుంది. ఈ దిగ్బంధనంలో ఇతర దేశాలు కూడా పాల్గొంటాయి. ఈ చట్టవిరుద్ధమైన దోపిడీ చర్య ద్వారా ఇరాన్ లాభపడటానికి అనుమతించరని” అని ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ మీడియా వేదికపై అన్నారు.
పాకిస్థాన్‌లో జరిగిన సుదీర్ఘ చర్చలు ‘బాగా’ జరిగాయని, చాలా అంశాలపై అంగీకారం కుదిరిందని’ అంగీకరిస్తూనే, తన అణు కార్యక్రమం విషయంలో టెహ్రాన్ వెనక్కి తగ్గడానికి నిరాకరించిందని ట్రంప్ అన్నారు.
“ప్రపంచంలోనే అత్యుత్తమమైన అమెరికా నౌకాదళం, హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించే ఏ నౌకనైనా తక్షణమే దిగ్బంధించే ప్రక్రియను ప్రారంభిస్తుంది,” అని ట్రంప్ అన్నారు.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణం కోసం ఇరాన్‌కు సుంకం చెల్లించిన ఏ నౌకనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డుకోవాలని తాను నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు.
ఆ వ్యూహాత్మక జలమార్గంలో ఇరాన్ అమర్చిన మందుపాతరలను అమెరికా దళాలు ధ్వంసం చేయడం ప్రారంభిస్తాయని కూడా ఆయన అన్నారు. అమెరికా నౌకలపైన గానీ, వాణిజ్య నౌకలపైన గానీ కాల్పులు జరిపే ఏ ఇరానీయుడినైనా “నరకానికి పంపేస్తాం” అని హెచ్చరించారు.

