హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) నిన్న హైదరాబాద్‌లో రెండు నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థలను ప్రారంభించింది. మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను అందిస్తున్నాయి.
ఈమేరకు టీజీఎంఎఫ్‌సీ ఛైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కొత్వాల్, కార్పొరేషన్ నైపుణ్యాభివృద్ధి, శిక్షణా పథకం కింద ఈ రెండు కేంద్రాలను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్‌లో జినాటినియం ఇన్‌స్టిట్యూట్, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బొడుప్పల్‌లో దినేష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని ప్రారంభించినట్లు ఒక పత్రికా ప్రకటన తెలిపింది.
ప్రారంభోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి కొత్వాల్ మాట్లాడుతూ… తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, మంచి ఉపాధి అవకాశాలను పొందడానికి ప్రభుత్వం అందిస్తున్న ఈ శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపినట్లు కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ఈ శిక్షణ ద్వారా మైనారిటీ యువతకు ఐటీ, డేటా సైన్స్,ఇతర ఆధునిక సాంకేతిక రంగాలలో బ్లూ కాలర్, వైట్ కాలర్ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కోడింగ్, డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్,కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వడం ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘AI పవర్‌హౌస్’గా మార్చాలనే లక్ష్యంతో మైనారిటీలతో సహా అన్ని వర్గాల వారికి శిక్షణ ఇస్తోంది.
