వాషింగ్టన్: ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలు ఇప్పుడు ఫోన్ ద్వారా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. “మేము ఇప్పుడు వారితో చర్చలు జరుపుతున్నాము, ఒక ఒప్పంద పత్రం చూడాలనుకున్న ప్రతిసారీ 18 గంటల విమాన ప్రయాణాలు చేయడం లేదు. మేము దీన్ని టెలిఫోన్ ద్వారానే చేస్తున్నామని” నిన్న వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ అన్నారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధాన్ని ముగించేందుకు ఏప్రిల్ 11న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా చర్చలు జరిపినప్పటికీ ఒక ఒప్పందానికి రాలేకపోయాయి. ఏప్రిల్ 8న పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ చర్చలు జరిగాయి. ఈ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించారు. ఈ వారాంతంలో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌ల పర్యటనను ఆయన రద్దు చేశారు.
తాను సాధారణంగా ముఖాముఖి సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ అంగీకరించారు. “నాకు ఎప్పుడూ ముఖాముఖి సమావేశాలే ఇష్టం, అదే ఉత్తమమని నేను భావిస్తాను. కానీ, ఒక సమావేశం జరపాలనుకున్న ప్రతిసారీ 18 గంటలు ప్రయాణించాల్సి రావడం, అదీ ఆ సమావేశం దేని గురించో తెలిసినప్పుడు… అది హాస్యాస్పదంగా ఉంటుందని” ట్రంప్ అన్నారు. ఇరాన్ అణ్వాయుధ ఆశయాలను పూర్తిగా వదులుకుంటేనే ఏ ఒప్పందమైనా సాధ్యమవుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
