హైదరాబాద్: గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. విధి నిర్వహణలో మరణించిన ఐదుగురు గిగ్,ప్లాట్ఫామ్ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. దీంతో, ఆయా ప్లాట్ఫామ్ కంపెనీల నుండి రూ. 10 లక్షలతో కలిపి, ప్రతి మృతుని కుటుంబానికి అందిన మొత్తం చెల్లింపు రూ. 15 లక్షలకు చేరింది. ఇలా చేయడం భారతదేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.
ఈమేరకు స్విగ్గీ డెలివరీ కార్మికుడు అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్, ఉబెర్ బైక్ టాక్సీ డ్రైవర్ జి శ్యామ్ సుందర్, జొమాటో డెలివరీ కార్మికుడు లోకుర్తి నరేష్, టాక్సీ డ్రైవర్ గర్లపాటి శశిధర్ రెడ్డి, బ్లింకిట్ డెలివరీ కార్మికుడు దారవత్ మహేష్ అనే ఐదుగురు కార్మికుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు.
యూనియన్ నిరంతర కృషి
ఈమేరకు తెలంగాణ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ)కు కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామిని అభినందించింది. ముఖ్యమంత్రి కార్యాలయం, కార్మిక శాఖతో యూనియన్ నిరంతరంగా చేసిన ఫాలో-అప్తో సమస్య పరిష్కారం అయిందని ఆయన పేర్కొన్నారు.
గిగ్ కార్మికుల సామాజిక భద్రత విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రిపై ఒత్తిడి తెస్తున్న టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ఈ పరిణామాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. “డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల సంక్షేమం, గౌరవం పట్ల తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది,” అని ఆయన అన్నారు.
దేశంలోని గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులందరికీ సమగ్ర సామాజిక భద్రత, ప్రమాద బీమా, చట్టపరమైన రక్షణల కోసం టీజీపీడబ్ల్యూయూ తన కృషిని కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.

