అంకారా: ఇజ్రాయెల్ విస్తరణవాద విధానాలే ఈ ప్రాంతానికి ప్రధాన భద్రతా ముప్పు అని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అన్నారు. నెతన్యాహు ప్రభుత్వ విస్తరణవాద, చట్టవిరుద్ధమైన, నిబంధనలను ధిక్కరించే విధానాలే మన ప్రాంతానికి ప్రధాన భద్రతా సమస్య అని ఇజ్రాయెల్ దురాక్రమణ మరోసారి స్పష్టం చేసిందని” రాజధాని అంకారాలో అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌మజీద్ టెబ్బౌన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఎర్డోగాన్ అన్నారు.
“మన ప్రాంత శాంతిభద్రతలకు తీవ్ర ముప్పుగా పరిణమించిన హింసను అంతం చేసే విషయంలో టర్కీ, అల్జీరియాలు ఒకే వైఖరితో ఉన్నాయని” ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో “ఇజ్రాయెల్ ఆక్రమణను, అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనలను, లెబనాన్‌పై దాని బరితెగించిన దాడులను, గాజాలో దాని అనాగరిక పద్ధతులను మేము ఖండిస్తున్నాము,” అని ఆయన అన్నారు.
అంతకుముందు, ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో జరిగిన ఉన్నత స్థాయి వ్యూహాత్మక సహకార మండలి సమావేశానికి ఇద్దరు నాయకులు సహ-అధ్యక్షత వహించారు. తరువాత వారు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాల కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇంధనం, మైనింగ్, రవాణా, వ్యవసాయం వంటి వ్యూహాత్మక రంగాలలో అల్జీరియాతో తమ సహకారాన్ని బలోపేతం చేయడానికి అంకారా నిశ్చయించుకుందని ఎర్డోగాన్ అన్నారు. ఇంధన సరఫరా భద్రత, “ముఖ్యంగా సహజ వాయువు” విషయంలో ఇరు దేశాలు దీర్ఘకాలిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకుంటున్నాయని ఆయన తెలిపారు.
అల్జీరియా, టర్కీలు ఆర్థిక సంబంధాలను విస్తరించుకోవాలని, తమ “ఉమ్మడి చారిత్రక వారసత్వాన్ని” పరిరక్షించుకోవాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయని టెబ్బౌన్ అన్నారు.
