చెన్నై: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని తమిళనాడు సీఎం విజయ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంటర్ మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్‌ను తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచే వ్యతిరేకిస్తోందని విజయ్ గుర్తు చేశారు.
ఈమేరకు ఆయన మాట్లాడుతూ…ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు, తమిళ మాధ్యమ విద్యార్థులు, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఈ పరీక్ష వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కోచింగ్ కేంద్రాలపై ఆధారపడే విధానంగా నీట్ మారిపోయిందని, దీంతో సామాన్య విద్యార్థులకు అవకాశాలు తగ్గుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం ఇదే మొదటిసారి కాదని, 2024లో కూడా పేపర్ లీక్ అయింది. ఆ సమయంలో ఆరు రాష్ట్రాల్లో కేసులు నమోదై, సీబీఐకి బదిలీ చేశారు. రెండేళ్లలో మళ్లీ ఇలాంటి ఘటన జరగడం జాతీయ స్థాయి పరీక్షా వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక లోపాలకు స్పష్టమైన నిదర్శనం” అని సీఎం విజయ్ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో నీట్‌ను రద్దు చేసి, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులలోని అన్ని సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా రాష్ట్ర కోటా కింద రాష్ట్రాలే భర్తీ చేసేందుకు అనుమతించాలన్న దీర్ఘకాల డిమాండ్‌ను తమిళనాడు ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోందని” ఆయన జోడించారు.
గత ఏడాది నవంబర్‌లో, 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య కోర్సులలో ప్రవేశాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన నీట్ మినహాయింపు బిల్లుకు భారత రాష్ట్రపతి ఆమోదం నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కాగా, యూపీఏ హయాంలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వైద్య ప్రవేశాల కోసం తమిళనాడుకు నీట్ ప్రవేశ పరీక్షల నుండి మినహాయింపు ఇచ్చారు. కానీ 2017లో కేంద్ర ప్రభుత్వం నీట్ (NEET)ను తప్పనిసరి చేయడంతో, ఆ రాష్ట్రం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

