టెల్‌అవీవ్: ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ నిన్న ఒక వీడియోను పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలకు గురయ్యారు. గాజాకు వెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాకు చెందిన కార్యకర్తలను ఇజ్రాయెల్ దళాలు అడ్డగించి, నిర్బంధించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
‘ఇజ్రాయెల్‌కు స్వాగతం’ అనే శీర్షికతో X అనే వెబ్ సైట్‌లో షేర్ చేసిన ఈ ఫుటేజ్‌లో, అష్డోడ్ పోర్ట్ సమీపంలోని ఒక నిర్బంధ కేంద్రంలో కార్యకర్తలు మోకాళ్లపై కూర్చొని, వారి చేతులు వెనుకకు కట్టేసి, తలలు నేలకు వంచి ఉండటం కనిపించింది.
మంత్రి బెన్ గ్విర్ నిర్బంధితుల మధ్య ఇజ్రాయెల్ జెండాను ఊపుతూ నడుస్తుండగా, నేపథ్యంలో ఇజ్రాయెల్ జాతీయ గీతం వినిపిస్తోంది.
ఒక క్లిప్‌లో, మంత్రి పక్కనుంచి వెళుతుండగా “పాలస్తీనాకు స్వేచ్ఛ” అని అరుస్తున్న ఒక మహిళను భద్రతా సిబ్బంది నేలపైకి తోసేశారు. “వారి అరుపులకు మీరు కలత చెందవద్దు” అని జైలు సిబ్బందితో బెన్ గ్విర్ చెప్పడం కూడా వినిపించింది.
వీడియో చూడండి
ככה אנחנו מקבלים את תומכי הטרור
— איתמר בן גביר (@itamarbengvir) May 20, 2026
Welcome to Israel 🇮🇱 pic.twitter.com/7Hf8cAg7fC
బెన్ గ్విర్‌ను మందలించిన నెతన్యాహు
ఈ వీడియో ఇజ్రాయెల్ సొంత నాయకత్వంలోనే విమర్శలకు దారితీసింది, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సదరు మంత్రిని మందలించారు. “ఫ్లోటిల్లా కార్యకర్తలతో మంత్రి బెన్ గ్విర్ వ్యవహరించిన తీరు ఇజ్రాయెల్ విలువలు, నిబంధనలకు అనుగుణంగా లేదు” అని నెతన్యాహు అన్నారు. కార్యకర్తలను “వీలైనంత త్వరగా” దేశం నుండి బహిష్కరించాలని తాను అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
బెన్ గ్విర్ తన చర్యలను సమర్థించుకున్నారు.”ఉగ్రవాద మద్దతుదారులు”గా తాను అభివర్ణించిన వారి పట్ల వ్యవహరించిన తీరుకు గర్వపడుతున్నానని అన్నారు. కాగా, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ కూడా బెన్ గ్విర్‌ను విమర్శించారు.
ఈ ఫుటేజ్‌పై తీవ్రంగా స్పందించిన తొలి దేశాలలో ఇటలీ ఒకటి. ప్రధానమంత్రి జార్జియా మెలోని ఈ వ్యవహారశైలిని “ఆమోదయోగ్యం కానిది”గా అభివర్ణించారు. ఇది “మానవ గౌరవాన్ని” ఉల్లంఘించిందని అన్నారు. ఈమేరకు రోమ్ ఇజ్రాయెల్ రాయబారిని పిలిపించి, ఫ్లోటిల్లాలోని ఇటాలియన్ పౌరుల నిర్బంధంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఫ్రాన్స్ కూడా ఈ సంఘటనను ఖండించింది. విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్, బెన్ గ్విర్ చర్యలను “ఆమోదయోగ్యం కానివి”గా పేర్కొంటూ, పారిస్‌లోని ఇజ్రాయెల్ రాయబారిని పిలిపించినట్లు ధృవీకరించారు.
స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ఈ వ్యవహారాన్ని “భయంకరమైనది, అమానుషమైనది”గా అభివర్ణించగా, ఐర్లాండ్ విదేశాంగ మంత్రి హెలెన్ మెక్‌ఎంటీ ఆ దృశ్యాలను చూసి తాను “దిగ్భ్రాంతికి” గురయ్యానని, నిర్బంధంలో ఉన్న కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విమర్శించిన టర్కీ, బ్రిటన్,కెనడా
ఇజ్రాయెల్ ప్రభుత్వం “హింసాత్మక,అనాగరిక మనస్తత్వాన్ని” ప్రదర్శిస్తోందని టర్కీ ఆరోపించింది.
నిర్బంధంలో ఉన్న బ్రిటిష్ జాతీయుల కుటుంబాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, ఇజ్రాయెల్ అధికారుల నుండి వివరణ కోరామని బ్రిటన్ తెలిపింది. వీడియోలో చూపిన ప్రవర్తన తీవ్రంగా కలవరపరిచేదిగా, ఏమాత్రం ఆమోదయోగ్యం కానిదిగా” ఉందని వర్ణిస్తూ, ఇజ్రాయెల్ రాయబారిని పిలిపిస్తామని కెనడా కూడా ప్రకటించింది.
అదేవిధంగా నెదర్లాండ్స్ కూడా ఈ ఫుటేజీని విమర్శించింది. నిర్బంధంలో ఉన్నవారి పట్ల ప్రవర్తన ప్రాథమిక మానవ గౌరవానికి విరుద్ధంగా ఉందని డచ్ అధికారులు పేర్కొన్నారు.
గాజాకు వెళ్తున్న నౌకాదళం అష్డోడ్ సమీపంలో అడ్డుకున్నారు
సుమారు 50 నౌకలతో కూడిన ఈ నౌకాదళం, గాజాపై ఇజ్రాయెల్ దిగ్బంధనాన్ని సవాలు చేసే ప్రయత్నంలో గత వారం టర్కీ నుండి బయలుదేరింది. సముద్రంలో ఈ నౌకాదళాన్ని అడ్డగించి అష్డోడ్ ఓడరేవుకు తీసుకువచ్చిన తర్వాత సుమారు 430 మంది కార్యకర్తలను నిర్బంధించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
ఈ నౌకాదళాన్ని హమాస్‌కు మద్దతు ఇచ్చే ప్రచార కార్యక్రమంగా ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. భద్రతా కారణాల దృష్ట్యా దిగ్బంధనం అవసరమని సమర్థించుకుంది.
మానవతా సహాయాన్ని అందించడం, గాజాలోని పరిస్థితులను వెలుగులోకి తీసుకురావడమే ఈ యాత్ర లక్ష్యమని ఫ్లోటిల్లా నిర్వాహకులు తెలిపారు. కాగా, నిర్బంధంలో ఉన్న కార్యకర్తలను ఇజ్రాయెల్ అధికారులు అవమానిస్తున్నారని, వేధిస్తున్నారని హక్కుల సంఘం అదాలా ఆరోపించింది.

