Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా!

Share It:

హైదరాబాద్: తెలంగాణ విద్యా కమిషన్ (TGEC) ఛైర్మన్ అకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు.
ఈమేరకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు ఉద్దేశించిన తన రాజీనామా లేఖలో, తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా రంగాల స్థితిగతులపై సమగ్ర నివేదికను, తగిన సిఫార్సులతో సహా సమర్పించే బాధ్యతను కమిషన్ పూర్తి చేసిందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

కమిషన్ ఛైర్మన్‌గా సేవలు అందించే అవకాశాన్ని కల్పించినందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, విద్యా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన తొలి విద్యా కమిషన్ చైర్మనే ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడంతో, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాలు, నూతన విద్యా చట్టాల రూపకల్పన ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఆకునూరి మురళి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గానూ, తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్‌గానూ పనిచేశారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్‌గానూ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)కు ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)గానూ ఆయన సేవలందించారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు కోసం ఉపయోగించిన, దేశంలోనే మొట్టమొదటి ‘కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ విధానం’ను రూపొందించడం…ఆయన సాధించిన విజయాలలో ఒకటి.

అంతేకాదు పేద కుటుంబాల గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో, స్వయం సహాయక సంఘాలను (SHG) భారీ ఎత్తున ప్రారంభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ బ్యాంకు మద్దతుతో చేపట్టిన APDPIP, APRPRP అనే రెండు ప్రాజెక్టుల ద్వారా, కోటి మంది పేద మహిళలను స్వయం సహాయక సంఘాల్లోకి సమీకరించడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అలాగే, అవిభక్త ఏపీలో MGNREGS కింద కోటి మంది కార్మికులను సమీకరించడంలోనూ ఆయన ప్రధాన పాత్ర వహించారు.

అవిభక్త తెలుగు రాష్ట్రంలో మూడేళ్ల కాలంలో 31,000 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంలో ఆకునూరి మురళి అత్యంత కీలక పాత్ర పోషించారు.

భారత పరిపాలనా సేవ (IAS) అధికారిగా ప్రభుత్వ యంత్రాంగంలో విశిష్టమైన కెరీర్‌ను కొనసాగించిన ఆకునూరి మురళి, భారత్ రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వ హయాంలో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు.

మాజీ IPS అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో కలిసి ఆయన బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు; అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారిద్దరూ వేర్వేరు మార్గాల్లో పయనించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే RS ప్రవీణ్ కుమార్ చురుకుగా ప్రచారం చేశారో, అదే BRSలో ఆయన చేరగా; మురళి తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

కాగా, తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా…ఆయన ప్రస్థానానికి ముగింపా, లేక మరొక పాత్రకు నాంది పలికే కొత్త ఆరంభమా అనేది వేచి చూడాల్సి ఉంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.