Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఈ మూడు రోజుల్లో వడగాలుల ధాటికి తెలంగాణలో 107 మంది మృతి!

Share It:

హైదరాబాద్: తెలంగాణలో తీవ్రమైన వడగాల్పులు పెనువిషాదం సృష్టించాయి. ఈ మూడు రోజుల్లో వడగాలుల దెబ్బకు 107 మంది మృతి చెందారు. ఒక్క శనివారం రోజే రాష్ట్రవ్యాప్తంగా 51 మంది వడదెబ్బతో మరణించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.

అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 మంది తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా మరణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 మరణాలు నమోదు కాగా, ఆ తర్వాత ఖమ్మంలో ఏడు, ఆదిలాబాద్‌లో ఐదు, నల్గొండ జిల్లాల్లో ఐదు మరణాలు సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, కొమరం భీమ్ ఆసిఫాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటడంతో ప్రజల ఇబ్బందులు తీవ్రమయ్యాయి.

మృతులలో సరస్వతీ అంత్య పుష్కరాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ఒక భక్తుడు కూడా ఉన్నాడని, అతను వడదెబ్బతో మరణించినట్లు సమాచారం. మే 27 వరకు వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో నేరుగా ఎండకు గురికాకుండా ఉండాలని, తగినంత నీరు తాగాలని ప్రజలకు సూచించింది. వేడి తీవ్రతపై ప్రజలకు గంటగంటకు హెచ్చరికలు జారీ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేలా చూడాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్లను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. వ్యవసాయ, నిర్మాణ కార్మికులకు భద్రతా చర్యలు అమలు చేయాలని, గ్రామ స్థాయిలో వడగాలులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వడదెబ్బ కేసులను ఎదుర్కోవడానికి ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.