Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఒప్పందం కుదిరితే ఇరాన్ అత్యున్నత నాయకుడిని కలవడం ‘గౌరవంగా’ భావిస్తా…ట్రంప్!

Share It:

వాషింగ్టన్‌: రెండు దేశాల మధ్య మంచి ఒప్పందం కుదిరితే, ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీని కలవడం తనకు ‘గౌరవప్రదమైన’ విషయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు మరణించిన అలీ ఖమేనీ (అప్పటి అత్యున్నత నాయకుడు) కుమారుడు, ఆయన వారసుడైన మొజ్తాబా ఖమేనీతో సమావేశం గురించి అడిగినప్పుడు, “నేను కలవాలని కోరుకోవడం లేదు, కానీ ఒకవేళ కలిస్తే మాత్రం, ఆయన్ని కలవడం నాకు గౌరవంగా ఉంటుంది” అని ట్రంప్ అన్నారు.

“మనం ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటామేమో చూడాలి, కానీ ఒకవేళ ఒప్పందం కుదిరితే, నేను ఆయన్ని కలిసే అవకాశం ఉంది,” అని ట్రంప్ చెప్పారు.

ఈ సమావేశం అమెరికాలో జరుగుతుందా అని అడగ్గా… “దీని గురించి నాకు పెద్దగా తెలియదు. నేనేమీ ఆ ప్రతిపాదన చేయలేదు, కానీ కొందరు వ్యక్తులు అలా సూచించారని ట్రంప్‌ పేర్కన్నారు.”

ఇరాన్ గనుక అమెరికా సైనికులను చంపితే, మళ్లీ యుద్ధం చేస్తారా అని అడిగినప్పుడు ట్రంప్ మాట్లాడుతూ…”అదొక బలమైన కారణం అవుతుంది. నిజాయితీగా చెప్పాలంటే, వారు అమెరికా సైనికులను చంపితే, నేను చాలా వేగంగా ఆ చర్య తీసుకుంటానని అనుకుంటున్నాను.”

ఇరాన్ నుండి సంపన్న యురేనియం పొందడానికి ఆ దేశంతో ఒప్పందం అవసరం లేదని కూడా ట్రంప్ చెప్పారు. “మేము దాన్ని ఇప్పుడే పొందవచ్చు. మేము కోరుకుంటే వారు మమ్మల్ని ఆపగలరని నేను అనుకోను, కానీ అలా చేయడానికి ఎటువంటి కారణం లేదు. అది భద్రంగా నిక్షిప్తం చేసి ఉన్నారని (entombed)” ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో ఆయన అన్నారు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన దాడిలో ట్రంప్ ఇజ్రాయెల్‌తో జతకలిశారు; ఆ దాడుల్లో అప్పటి అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ సహా ఇతర కీలక నేతలు చాలామంది మరణించారు.

అయితే, ప్రపంచ చమురు రవాణాలో ఐదవ వంతు జరిగే ఇరుకైన జలమార్గమైన ‘హర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) పై నియంత్రణ సాధించడం ద్వారా ఇరాన్ వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. అంతేకాకుండా, అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ అరబ్ రాజ్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి, స్థిరత్వానికి ఆ దేశాలు కష్టపడి సంపాదించుకున్న పేరుప్రతిష్టలను దెబ్బతీసింది. 40 రోజుల యుద్ధం తర్వాత, ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇరాన్ చాలా వరకు శాంతియుతంగా ఉంది.

కానీ వారాల తరబడి జరిగిన చర్చలు దీర్ఘకాలిక శాంతి ఒప్పందాన్ని కుదర్చడంలో విఫలమయ్యాయి. ఈ వారం హర్ముజ్ జలసంధి, కువైట్, బహ్రెయిన్‌లలో జరిగిన దాడులతో ఉద్రిక్తతలు అధికంగానే ఉన్నాయి.

ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించాలని కోరుకుంటోందని ఇజ్రాయెల్, అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఇరాన్‌పై దాడి చేయడానికి ఆ ముప్పునే కారణంగా చూపుతూ అధ్యక్షుడు ట్రంప్ వాదిస్తున్నారు. యుద్ధాన్ని ముగించే ఏ ఒప్పందంలోనైనా, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదని, యురేనియంను నాశనం చేస్తారని అంగీకరించాలని ట్రంప్ పట్టుబట్టారు.

తమకు ఎలాంటి సైనిక ఆశయాలు లేవని టెహ్రాన్ పదేపదే ఖండించింది. పౌర ప్రయోజనాల కోసం ఆ సాంకేతికతను పొందే హక్కు తమకు ఉందని నొక్కి చెప్పింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.