ముహమ్మద్ ముజాహిద్… 🖋️
మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి… ప్రాణభయంతో జనం హాహాకారాలు చేస్తున్నారు… దట్టమైన కాళరాత్రి లాంటి పొగ ఊపిరితిత్తులను పిండేస్తోంది. “కాపాడండి.. ప్లీజ్ కాపాడండి..” అంటూ కిటికీల గుండా చాచిన ఆ చేతులు, ఆ ఆఖరి చూపులు.. చావు కళ్లముందు తాండవిస్తున్న వేళ.. స్వార్థం రాజ్యమేలే ఈ రోజుల్లో, ఎక్కడో పుట్టి ఎవరికో పుట్టిన పరాయి వాళ్ల కోసం.. తమ ప్రాణాలను పణంగా పెట్టారు ఆ ఐదుగురు ముస్లిం యువకులు. “తమ మతం నేర్పే మానవత్వ పాఠాలను’’ అని చాటిచెప్తూ, కరుడుగట్టిన కాషాయ నేత సైతం కన్నీళ్లతో సెల్యూట్ చేసేలా సాహసం చేశారు. దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన భారీ అగ్నిప్రమాదంలో వెలుగుచూసిన ఈ ‘రియల్ హీరోల’ స్ఫూర్తిదాయక గాథ ఇది…
అగ్నిగుండంలోకి అడుగులు.. ఆఖరి శ్వాస కోసం పోరాటం!
బుధవారం మాలవీయ నగర్‌లోని హౌజ్ రాణి ప్రాంతం ఒక్కసారిగా నరకప్రాయంగా మారింది. ఒక బడ్జెట్ హోటల్‌లో చెలరేగిన మంటలు చూస్తుండగానే భవనాన్ని చుట్టేసాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పై అంతస్తుల నుంచి జనం కిందకు దూకుతున్నారు. ఊపిరాడక కొందరు కళ్లముందే స్పృహ తప్పిపోతున్నారు. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపే జరగరాని నష్టం జరిగిపోతోంది.. మృత్యువు అట్టహాసం చేస్తోంది.
సరిగ్గా అదే సమయంలో.. అఫ్జల్, మహ్మద్ షారూఖ్, మహ్మద్ అనీస్, మహ్మద్ ఆమిర్, మహ్మద్ వసీమ్ అనే ఐదుగురు స్థానిక యువకులు అగ్నిప్రమాదాన్ని చూశారు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. లోపల అమాయకులు కాలిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయారు. కన్నవాళ్ల ముఖాలు కూడా గుర్తుకురాలేదు.. ఆ క్షణంలో వారికి కనిపించింది కేవలం లోపల వినిపిస్తున్న ఆర్తనాదాలు మాత్రమే!ఢిల్లీ పోలీసులతో చేతులు కలిపి, యమద్వారంలా మారిన ఆ భవనంలోకి దూసుకెళ్లారు. ఒక్కసారి కాదు.. పదే పదే ఆ అగ్నిగుండంలోకి వెళ్లి, మంటల నడుమ చిక్కుకున్న వారిని తమ భుజాలపై మోస్తూ, కాలుతున్న ఒంటి గాయాలను కూడా లెక్కచేయకుండా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ యువకుల చేతులు కాలాయి.. కానీ కాపాడిన ప్రాణాల ఊపిరి చూసి వారి గుండెలు ఉప్పొంగాయి.
నెత్తురు లేని గుండెలకు.. కన్నీటి చారికలు!
ఆ యువకుల సాహసానికి మాలవీయ నగర్ (BJP) ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ్ సైతం ఫిదా అయ్యారు. వారి ఫోటోలను సోషల్… మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.”ఈ వీరులకు నా మనస్ఫూర్తిగా సెల్యూట్! ఇతరుల ప్రాణాలు కాపాడటానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు ప్రదర్శించిన ధైర్యం, మానవత్వం అసాధారణమైనవి. కులమతాలకు అతీతంగా వీరు చూపిన ప్రేమ దేశానికి ఆదర్శం” అని ఆయన కొనియాడారు.
పరుపుల వ్యాపారి ‘లక్షల’ ఉదారత.. కన్నీళ్లు తెప్పించిన తృప్తి!
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కేవలం యువకులే కాదు.. 61 ఏళ్ల వృద్ధుడు రియాజుద్దీన్ కూడా మానవత్వ శిఖరంగా నిలిచారు. హోటల్ ఎదురుగా పరుపుల దుకాణం నడుపుకునే ఆ వృద్ధుడు.. పై అంతస్తుల నుండి జనం కిందకు దూకడం చూసి చలించిపోయారు. కింద పడితే ప్రాణాలు పోతాయని గ్రహించి, క్షణాల్లో తన దుకాణంలోని పరుపులన్నింటినీ రోడ్డుపై పరిచారు. పైనుంచి పడిన వారికి ఆ పరుపులు రక్షణ కవచాలుగా మారి, వారి ప్రాణాలను నిలిపాయి. ఈ ప్రక్రియలో ఆయనకు సుమారు రూ. 2 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒక సామాన్య వ్యాపారికి అది జీవితకాల సంపాదన కావచ్చు. కానీ, ఆయన ముఖంలో ఎలాంటి బాధ లేదు.. ఒకటే తృప్తి.”నా పరుపులన్నీ తగలబడిపోయినా పర్లేదు, నా వ్యాపారం పోయినా పర్లేదు.. నా పరుపుల వల్ల కనీసం పది మంది ప్రాణాలైనా నిలిచాయి కదా.. ఒక తండ్రిగా, ఒక మనిషిగా నాకదే చాలు” అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తెప్పించాయి.
మృత్యు ముఖంలోంచి ప్రాణం పోస్తూ..మరో స్థానిక యువకుడు, మాక్స్ హాస్పిటల్ సెక్యూరిటీ ఆఫీసర్ వసీం రజా ఆ భవనంలో నరకాన్ని చూశాడు. ఊపిరాడక పడిపోయిన పది మందికి పైగా బాధితులకు బేస్‌మెంట్ నుండి మూడో అంతస్తు వరకు పొగను చీల్చుకుంటూ వెళ్లి, తన సొంత శ్వాసను అందిస్తూ సిపిఆర్ (CPR) ఇచ్చి బతికించాడు. మరోవైపు 40 ఏళ్ల మహ్మద్ ఇస్రార్ ఖాన్ అనే వాలంటీర్ లోపలికి వెళ్లి గాయపడిన వారిని కాపాడటమే కాక.. అప్పటికే కాలిపోయిన మృతదేహాలను చూసి తట్టుకోలేక, కన్నీళ్లతో ఆ దేహాలను బెడ్‌షీట్లలో చుట్టి, ఒక సొంత బిడ్డలా భుజాన వేసుకుని బయటకు మోసుకొచ్చాడు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది.
విషాదంలోనూ వెలిగిన ఆశాదీపం!
ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఆఫ్రికా, తుర్క్మెనిస్తాన్ దేశాలకు చెందిన విదేశీయులు కూడా ఉన్నారు. కేవలం లాభాల కోసం అగ్నిమాపక అనుమతులు లేకుండా, కేవలం 6 గదుల అనుమతితో 20కి పైగా గదులను నడిపిన హోటల్ యజమాని లోకేష్ బజాజ్ స్వార్థానికి ఇంతమంది బలయ్యారు. హోటల్ యజమాని నిర్లక్ష్యం ప్రాణాలను బలిగొంటే.. ఈ ఐదుగురు ముస్లిం యువకులు, స్థానికులు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 47 మంది ప్రాణాలను మృత్యువు నోటి నుండి లాక్కొచ్చారు. ‘నువ్వు ఏ మతం? ఏ కులం?’ అని అడగకుండా, కేవలం ‘మనిషి’ని చూసి ప్రాణాలర్పించిన ఈ యువకుల గాథ.. ద్వేషం నిండిన సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందనే ఆశను చిగురింపజేస్తోంది. నిజమైన హీరోలంటే సినిమా తెరపై డూప్‌లతో ఫైట్లు చేసేవారు కాదు.. సమాజం కోసం, తోటి మనిషి కోసం ప్రాణాలను పణంగా పెట్టే వీరేనని నిరూపించారు!
