వాషింగ్టన్: విదేశాల్లో ఉపాధికోసం వెళుతున్న మనోళ్లకు కష్టాలొచ్చాయి. ఎన్నో కలలతో భారీగా ఖర్చుచేసి విమానాలెక్కుతున్న భారతీయులను అగ్ర రాజ్యం వెనక్కిపంపుతోంది. అక్రమ వలసలను అరికట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ, ఈ ఏడాది ఇప్పటివరకు 1,076 మంది భారతీయ పౌరులను అమెరికా బహిష్కరించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. కాగా, 2025లో మొత్తం 3,567 మంది భారతీయులను బహిష్కరించినట్లు MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.
అమెరికాలోని అక్రమ వలసదారులపై ట్రంప్ యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. బహిష్కరణ, వలసలు, ప్రజల రాకపోకలకు (mobility) సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని జైస్వాల్ తెలిపారు.
“వలసలు, ప్రజల రాకపోకలకు సంబంధించి ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చట్టబద్ధమైన వలసలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకుంటూనే, అక్రమ వలసలను ఎలా అరికట్టాలనే దానిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం,” అని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా 2009 నుంచి ఇప్పటి వరకూ 18,822 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించిందన్నారు. 2023లో 617 మందిని, 2024లో 1,368 మందిని, 2025లో 3,258 మంది భారతీయులను అమెరికా బహిష్కరించినట్లు వివరించారు. ‘జనవరి 2025 నుంచి ఇప్పటి వరకూ మూడువేల మందికిపైగా భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. వీరిలో 2,032 మంది అంటే సుమారు 62.3 శాతం మందిని సాధారణ వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి పంపింది. మిగిలిన 1,226 మందిని (37.6 శాతం) యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించే చార్డర్ విమానాల్లో భారత్కు తరలించిందిని వెల్లడించారు.
కాగా, గత ఐదేళ్లలో అమెరికా నుంచి ఈ స్థాయిలో బహిష్కరణలు జరగడం ఇదే మొదటిసారి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు, వీసా పత్రాల క్షుణ్ణమైన తనిఖీలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


