హైదరాబాద్: ఆదివాసీ తండాలు సహా గ్రామీణ ప్రాంతాల్లోని 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ’ తీవ్రంగా ఖండించింది. ఇది లక్షలాది మంది అట్టడుగు వర్గాల విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు కలిగించే “ఆదివాసీ, గ్రామీణ వ్యతిరేక” చర్య అని పేర్కొంది.
ఈ మూసివేత ఆదేశాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. చక్రధర రావు, కార్యదర్శులు ప్రొఫెసర్ జి. హరగోపాల్, ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను “కాలం చెల్లిన విధానం”గా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, అవి ఆదివాసీ,గ్రామీణ వర్గాల వాస్తవ పరిస్థితులను విస్మరించాయని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలల మెరుగుదల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప పెద్దగా ఏమీ చేయలేదని, పైగా గత TRS/BRS ప్రభుత్వం అనుసరించిన “కార్పొరేట్ అనుకూల విద్యా విధానాలనే” కొనసాగిస్తోందని కమిటీ పేర్కొంది.
రాష్ట్ర బడ్జెట్లో 15% విద్యకు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు; దేశంలోనే విద్యపై అత్యల్ప బడ్జెట్ వాటాను ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని వారు గుర్తుచేశారు. వేలాది పాఠశాలలను మూసివేయడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనపడుతుందని, ఆదివాసీ, దళిత, పేద, గ్రామీణ పిల్లలకు విద్యావకాశాలు తగ్గుతాయని, చాలా మంది విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు హెచ్చరించారు.
గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో “హేతుబద్ధీకరణ” (rationalisation) ప్రక్రియ అమలును వెంటనే నిలిపివేయాలని వారు కోరారు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20% విద్యకు కేటాయించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలని, నాణ్యతను కాపాడేందుకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక గది ఉండేలా చూడాలని కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ పాఠశాలలను కుదించడం కాకుండా, వాటిని బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు,ప్రజాస్వామ్య శక్తులకు ‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.


