హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 9:30 గంటలకు ఆరుట్లలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (TPS)ను అట్టహాసంగా ప్రారంభించారు. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీపడేలా అత్యాధునిక వసతులతో రూపొందించిన ఈ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (TPS), రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఒక నూతన విప్లవానికి నాంది పలకనుంది. ఇది ముఖ్యమంత్రి కలల ప్రాజెక్ట్.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం, రేవంత్ రెడ్డి డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్‌లు, భోజనశాల మరియు క్రీడా మైదానాలను పరిశీలించారు. తరువాత విద్యార్థులు, ఉపాధ్యాయులు,పాఠశాల కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు; వారి అభిప్రాయాలను తెలుసుకుంటూనే విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అదే వేదిక వద్ద ఒక బహిరంగ సభలో ప్రసంగించారు.
కార్పొరేట్ సంస్థలకు సమానమైన స్థాయిలో ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో, సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ అకునూరి మురళి అధ్యక్షతన ‘తెలంగాణ విద్యా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ పర్యవేక్షణలోనే అరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి చేసారు.
TPS భావనను (concept) అభివృద్ధి చేయడంలో విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ అకునూరి మురళి, సభ్యులు పి.ఎల్. విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డిల కృషి ఎంతో కీలకమైనది.
ఈ పాఠశాల నర్సరీ స్థాయి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తుంది. నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఉచిత బస్సు రవాణా, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం వేళల్లో అల్పాహారం (స్నాక్స్) అందించనున్నారు. బోధన ఆంగ్ల మాధ్యమంలో జరుగుతుంది. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక వసతులతో కూడిన ఈ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా రాష్ట్రంలో విద్యా రంగానికి ఒక ఆదర్శ నమూనాగా రూపొందించారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలల్లో రంగారెడ్డి జిల్లాలోని అరుట్ల, మంచాల, అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ విధానాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది; ఇందులో భాగంగా దశలవారీగా 100 పాఠశాలలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అరుట్ల, చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి ప్రభుత్వం 5 పాఠశాల బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న తమ పిల్లలను తెలంగాణ పబ్లిక్ స్కూల్లో చేర్పించడానికి ఈ చొరవ తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం, అరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రీ-ప్రైమరీ విభాగంలో సుమారు 150 మంది, ప్రాథమిక పాఠశాలలో 600 మంది, రెండు హైస్కూల్ బ్లాకులలో కలిపి 800 మంది, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవతర్సరం 160, రెండవ సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు.
కాగా, ఈ స్కూల్లో చేర్చేందుకు తల్లిదండ్రుల నుండి విపరీతమైన డిమాండ్ రావడంతో, పాఠశాల యాజమాన్యం ‘ప్రవేశాలు లేవు’ (No Admission) అనే బోర్డును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
“భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది”… అన్నది ఇక పై ఒక నినాదం మాత్రమే కాదు… కళ్ల ముందు కనిపించే నిజం. ఆ నిజానికి సాక్ష్యం ఆరుట్లలోని “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.
— Revanth Reddy (@revanth_anumula) June 16, 2026
మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి… pic.twitter.com/CBVOrP3znh
