టెహ్రాన్: లెబనాన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా-ఇరాన్ చర్చలలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తాజాగా ప్రకటించారు. పాకిస్థాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ సమావేశాలలో, లెబనాన్‌లో సైనిక చర్యలను నిలిపివేయడానికి, శాంతిని పర్యవేక్షించడానికి ఒక ‘డీ-కాన్‌ఫ్లిక్షన్ సెల్’ను ఏర్పాటు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు నేడు రెండవ రోజు చర్చలకు సిద్ధమయ్యారు.
కాగా, చర్చల సందర్భంగా తాము “ప్రోత్సాహకరమైన పురోగతి”గా అభివర్ణించిన దానిని మధ్యవర్తులైన ఖతార్, పాకిస్తాన్ ప్రశంసించాయి. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన జలమార్గం అయిన హర్ముజ్ జలసంధి తెరిచి ఉండేలా చూసేందుకు “యంత్రాంగాల” ఏర్పాటు, దక్షిణ లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగడం వంటి పలు అంశాలలో పురోగతి సాధించినట్లు ఒక సీనియర్ అమెరికా దౌత్యవేత్త పేర్కొన్నారు.
అయినప్పటికీ, ఖతార్, పాకిస్తాన్ అధికారులతో కలిసి అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగిన చర్చల మొదటి రోజు, స్విస్ చర్చల వేదికకు వేల మైళ్ల దూరంలో ఉండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలతో కుదుపునకు గురైంది. ఆయన ఇరాన్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు.

