ఎన్.ఆర్.మహంతి, సీనియర్ పాత్రికేయులు…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్వభావం గురించి సర్దార్ పటేల్ ఏమనుకున్నారో, నేటి భారతదేశంలో అది మరింత స్పష్టమవుతోంది; కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు పటేల్ RSSపై నిషేధం విధించారు. కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే, ‘భారత ఉక్కు మనిషి’ (Iron Man of India) ఆ బలమైన వ్యక్తిత్వానికి అనుగుణంగా వ్యవహరించి, RSSను మళ్లీ జవాబుదారీగా చేయగలరా?
అయితే, ఈ రెండు పరిస్థితుల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. 1948లో, RSS ఒక సాధారణ సంస్థగా మాత్రమే ఉండేది; దానికి తగినంత మద్దతు ఉన్నప్పటికీ, రాజకీయంగా పెద్దగా ప్రభావం ఉండేది కాదు. అందుకే పటేల్ RSSను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించినప్పుడు, ఏ రాజకీయ పార్టీ కూడా తమ నిరసనను తెలపడానికి ముందుకు రాలేదు. వాస్తవానికి, దేశంలోని చాలా మంది ఆ నిర్ణయాన్ని స్వాగతించారు.
కాగా, నేడు RSS భారత ప్రభుత్వాన్ని నియంత్రిస్తోంది. ఒకప్పుడు తమ సంస్థలో సాధారణ కార్యకర్తగా ఉన్న నరేంద్ర మోదీని అది ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. నేటి అధికార యంత్రాంగంలో కీలకమైన వారందరూ సంఘ్ పరివార్ పట్ల తమ అచంచలమైన విధేయతను బహిరంగంగా ప్రకటిస్తుంటారు.
కాబట్టి RSSపై నిషేధం విధించడం ఆచరణ సాధ్యం కాని ఆలోచన. చేయవలసిన పని ఏమిటంటే, ఆ అస్పష్టమైన సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావడం. ఈ అపారదర్శక వ్యవస్థ సందేహాస్పద స్వభావాన్ని పటేల్ ఎలా గ్రహించారో, దాని గురించి ఏమాత్రం మొహమాటం లేకుండా ఎలా మాట్లాడారో ప్రజలకు గుర్తు చేయాలి. అంతేకాదు RSS అస్పష్టమైన గతం,ప్రశ్నార్థకమైన వర్తమానంపై చర్చను ప్రారంభించడంలో సహాయపడినందుకు ఖర్గేను అభినందించాలి.
RSS గతం నిజంగానే అస్పష్టమైనది; దాని దేశ వ్యతిరేక స్వభావం మన దేశ స్వాతంత్ర్య సమరయోధులకు స్పష్టంగా తెలిసిన విషయమే. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందడానికి గాంధీ అనుచరులు లక్షలాది మంది తమ ప్రాణాలను, జీవనోపాధిని త్యాగం చేస్తుండగా, RSS సభ్యులు వలస పాలకులుకు మద్దతుదారులుగా బహిరంగంగా, ఏమాత్రం సంకోచం లేకుండా వ్యవహరించేవారు. స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్తలపై నిఘా ఉంచడానికి బ్రిటిష్ వారు RSSను ఉపయోగించుకున్నారు. గాంధీని ముస్లింల పక్షపాతిగా, హిందువుల శత్రువుగా సంఘ్ పరిగణించేది.
అందుకే, ముస్లిం వ్యతిరేక భావజాలం కలిగిన హిందూ మహాసభ కార్యకర్త నాథూరామ్ గాడ్సే చేతిలో మహాత్మా గాంధీ హత్యకు గురైనప్పుడు, RSS పాత్రపై అనుమానాలు తలెత్తాయి. చర్యల నుండి తప్పించుకోవడానికి, అప్పటి RSS అధినేత M.S. గోల్వాల్కర్, ఒక సంతాప సందేశం జారీ చేసారు: “ఈ క్రూరమైన, ప్రాణాంతకమైన దాడికి, గొప్ప వ్యక్తిని విషాదకరంగా కోల్పోయినందుకు నెనెంతో దిగ్భ్రాంతి చెందానని అన్నారు.”
అంతే కాదు; ఎలాంటి శిక్షాత్మక చర్యలను అయినా ముందుగానే నివారించడానికి, గోల్వాల్కర్ ఈ దారుణ హత్యను ఖండిస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, హోం మంత్రి పటేల్ ఇద్దరికీ సందేశాలు పంపారు; ఆ సందేశాలలో, ఆయన గాంధీజీని వర్ణించడానికి తన సహజ స్వభావానికి విరుద్ధమైన అతిశయోక్తులను ఉపయోగించారు. ఉదాహరణకు: ‘నాథూరామ్ గాడ్సే ఒక ఆలోచనారహితమైన, వికృతమైన ఆత్మ. అతను బుల్లెట్‌తో పూజ్య మహాత్మాజీ జీవితానికి హఠాత్తుగా, భయంకరంగా ముగింపు పలికే హేయమైన చర్యకు పాల్పడ్డాడు.’
కానీ పటేల్ చలించలేదు; ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సందేహాస్పద స్వభావాన్ని గ్రహించారు. అదే ప్రభుత్వ సర్క్యులర్‌లో వ్యక్తమైంది. గాంధీ హత్య జరిగిన మూడు రోజుల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తూ హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్, ఆర్‌ఎస్‌ఎస్ చెప్పేదానికి, ఆచరించేదానికి మధ్య ఉన్న తీవ్రమైన వ్యత్యాసాన్ని వెలుగులోకి తెచ్చింది.
“హిందువుల శారీరక, మేధో, నైతిక శ్రేయస్సును ప్రోత్సహించడం, అలాగే వారిలో సోదరభావం, ప్రేమ, సేవాభావాలను పెంపొందించడం ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించిన లక్ష్యాలు, ఆశయాలు… అయితే, ఆచరణలో ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు తాము ప్రకటించిన ఆదర్శాలకు కట్టుబడి ఉండటం లేదని ప్రభుత్వం గమనించింది. సంఘ్ సభ్యులు దహనకాండ, దోపిడీ, బందిపోటు, హత్య వంటి హింసాత్మక చర్యలకు పాల్పడటంతో పాటు, అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించి, అవాంఛనీయమైన, ప్రమాదకరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారు. ప్రజలను ఉగ్రవాద పద్ధతులను అవలంబించమని ప్రేరేపించే కరపత్రాలను వారు పంపిణీ చేస్తున్నట్లు కనుగొన్నామని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది.”
ఈ పరిణామాలన్నీ “సంఘ్‌ను దాని కార్పొరేట్ హోదాలో ఎదుర్కోవాల్సిన బాధ్యతను ప్రభుత్వంపై మోపాయి” అని హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ స్పష్టంగా పేర్కొంది.
అప్పటి నుండి ఆర్‌ఎస్‌ఎస్ ప్రాథమిక స్వభావం, లక్షణాలలో పెద్దగా ఏమీ మారలేదు; గత ఎనిమిది దశాబ్దాలలో ఆర్‌ఎస్‌ఎస్ ఒక బృహత్ సంస్థగా ఎదిగిందన్నదే ఏకైక తేడా; దాని రహస్య కార్యకలాపాలు అనేక రెట్లు పెరిగాయి. దాని పెరుగుతున్న రాజకీయ పలుకుబడి దానిని చట్టపరంగా అనియంత్రితంగా మార్చింది.
……………
RSS ఆర్థిక వనరులలో విదేశీ నిధుల ప్రవాహం
RSSకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే ప్రశ్నించినప్పుడు, అది ఆ సంస్థ అత్యంత సున్నితమైన అంశాన్ని తాకినట్లయింది. తమ ఆదాయమంతా సభ్యుల ‘గురు దక్షిణ’ నుండే వస్తుందన్న RSS సాధారణ వాదనలోని డొల్లతనాన్ని ఒక సరైన విచారణ బయటపెడుతుంది. అది తన ఆర్థిక వివరాలను ప్రభుత్వానికి ఎందుకు సమర్పించకూడదు? విదేశీ లేదా దేశీయ సంస్థాగత విరాళాలు ఏవీ స్వీకరించనందున, ఏ అధికారిక సంస్థకూ వాటిని వెల్లడించాల్సిన చట్టపరమైన బాధ్యత తమకు లేదని ఆ సంస్థ తరచుగా చెబుతుంటుంది.
కానీ ఆ వాదన చెల్లదు. భారత ప్రభుత్వం నిషేధించిన (సమంజసంగానే నిషేధించిన) ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ (SIMI) కూడా, తమకు సభ్యుల విరాళాల నుండే నిధులు సమకూరుతాయని, ఆర్థిక విషయాల్లో ఏ ప్రభుత్వ అధికారికి జవాబుదారీ కాదని చెప్పుకునేది. కానీ అప్పటి ప్రభుత్వం ఆ పైపైన చెప్పే వివరణను అంగీకరించలేదు. దానిపై కఠిన చర్యలు తీసుకుంది.
RSS అనేది SIMIకి మరో కోణం (లేదా మరో వైపు) లాంటిది. SIMI ప్రమాదకరమైన మైనారిటీ మతతత్వానికి పాల్పడితే, RSS మెజారిటీ మతతత్వానికి బహిరంగ ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. దీనిని ఎందుకు ప్రత్యేకమైన లేదా ఉన్నతమైన స్థానంలో ఉంచాలి? కేవలం మెజారిటీవాదాన్ని జాతీయవాదంగా ముసుగు వేసి ప్రదర్శిస్తున్నందుకా?
SIMIకి పాకిస్థాన్‌లోని భారత వ్యతిరేక శక్తుల నుండి నిధులు అందేవని మనందరికీ తెలుసు. అదేవిధంగా, RSS కూడా విదేశాల నుండి, తరచుగా అనుమానాస్పద వనరుల నుండి భారీగా వనరులను సమకూర్చుకుంటోందనడానికి అనేక పరిశోధనాత్మక నివేదికల ద్వారా బలమైన ఆధారాలు లభించాయి.
2002లో ‘ది ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ హేట్: IDRF అండ్ ది అమెరికన్ ఫండింగ్ ఆఫ్ హిందుత్వ’ (ద్వేషం విదేశీ మారకం: IDRF,హిందుత్వకు అమెరికన్ నిధులు) అనే సంచలనాత్మక నివేదిక ద్వారా ‘సౌత్ ఆసియా సిటిజన్స్ వెబ్’ భారతదేశంలో హిందుత్వ కార్యకలాపాలకు అందుతున్న నిధులపై మన దృష్టిని ఆకర్షించింది. ఇది మేరీల్యాండ్ కేంద్రంగా పనిచేసే అమెరికన్ స్వచ్ఛంద సంస్థ అయిన ‘ఇండియా డెవలప్‌మెంట్ అండ్ రిలీఫ్ ఫండ్’ (IDRF) అనే ఒకే ఒక్క అమెరికన్ సంస్థపై దృష్టి సారించింది. భారతదేశంలోని పేద, మారుమూల గిరిజన, గ్రామీణ ప్రాంతాలలో మత ‘మార్పిడి’, ‘హిందూకరణ’ను ప్రధాన పనిగా కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలకు ఐడిఆర్‌ఎఫ్ నిధులు ఎలా పంపిణీ చేసారో ఈ నివేదిక ఆధారాలతో సహా అందించింది.
ఈ నివేదిక, ఐడిఆర్‌ఎఫ్ లబ్ధిదారులలో ఒకటైన గుజరాత్‌లోని వనవాసి కళ్యాణ్ ఆశ్రమం కేసును, పాఠశాలలు, కళాశాలలు, చర్చిలు, శ్మశానవాటికల వంటి క్రైస్తవ సంస్థలను భౌతికంగా ధ్వంసం చేయడంతో సహా క్రైస్తవ వ్యతిరేక హింసలో దాని విస్తృతమైన ప్రమేయాన్ని నమోదు చేసింది.
అంతేకాదు ఈ నివేదికలో “1998-2000 మధ్య క్రైస్తవ వ్యతిరేక హింసలో పాలుపంచుకున్న అవే హిందుత్వ సంస్థలు 2002 గుజరాత్ మారణకాండలో కూడా పాలుపంచుకున్నాయని చూపించే ద్వితీయ పత్రాలు కూడా ఉన్నాయి. అత్యంత విశ్వసనీయమైన నివేదికల ప్రకారం, అక్కడ 2000 మందికి పైగా ప్రజలు, వీరిలో అధికశాతం ముస్లింలు, ఊచకోతకు గురయ్యారు.” 1995 నుండి 2002 మధ్య IDRF, RSS సంస్థలకు 3 మిలియన్ డాలర్లకు పైగా పంపిందని డాక్యుమెంటరీ ఆధారాలను ఇది అందించింది.
ఫ్రంట్‌లైన్ తన జూలై-2021 నివేదిక ‘సంఘ్ పరివార్ US నిధుల జాడ’లో, US ఆధారిత హిందూ సంస్థల నుండి RSS అనుబంధ సంస్థల ఖజానాకు పెద్ద మొత్తంలో డబ్బు ఎలా చేరిందో కూడా సమగ్ర వివరాలను అందించింది.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPI(M)) అధికారిక పత్రిక అయిన ‘ది పీపుల్స్ డెమోక్రసీ’, తన జనవరి 2026 సంచికలో పారిస్‌కు చెందిన ‘సెరి-సైన్సెస్ పో’ (Ceri-SciencesPo), ఢిల్లీకి చెందిన ‘క్యారవాన్’ (Caravan) పత్రికల ఉమ్మడి పరిశోధనా నివేదికలోని వివరాలను ప్రచురించింది. విశ్వ హిందూ పరిషత్ (VHP) USAకు అనుబంధంగా ఉన్న ‘సపోర్ట్ ఎ చైల్డ్ USA’ అనే సంస్థ, భారతదేశంలోని RSS మద్దతు గల సంస్థలకు నిధులు సమకూరుస్తోందని ఈ నివేదిక ఆధారాలతో సహా వెల్లడించింది. వాస్తవానికి, విదేశాలలో ఉన్న అనేక RSS అనుబంధ సంస్థలు అక్కడి దాతల నుండి నిధులను సేకరించి, వాటిని భారతదేశంలోని వివిధ RSS-సంబంధిత సంస్థలకు మళ్లిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.
ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ అద్దం పట్టే అనేక చిన్న, పెద్ద స్వచ్ఛంద సంస్థలకు (NGOs) విదేశీ నిధులు ప్రధాన ఆధారం. అయితే, ‘సులభంగా వచ్చే డబ్బుతో సమస్యలు సృష్టిస్తున్నాయనే’ నెపంతో ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఈ ప్రజాహిత సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ, విదేశీ నిధులు పొందే NGOల పట్ల మోదీ ప్రభుత్వం చూపే అనుమానం లేదా అప్రమత్తత RSS విషయంలో మాత్రం కనిపించదు.
మొత్తంగా ఆర్‌ఎస్‌ఎస్ డబ్బు సంచులు విదేశీ డబ్బుతో నిండిపోయి ఉన్నాయి. అంతేకాకుండా, ఆర్‌ఎస్‌ఎస్ తన ఆర్థిక, సంస్థాగత బలాన్ని ఉపయోగించి మైనారిటీలపై దేశవ్యాప్త విద్వేష ప్రచారాలు చేస్తోందన్నది అందరికీ సుస్పష్టం. కాషాయ సోదరవర్గానికి అందుతున్న నిధులను అధికారికంగా పరిశీలించడానికి ఇదే సరైన సమయం.
(ద వైర్ సౌజన్యంతో)
