లక్నో: అయోధ్య రామ్ మందిరానికి సంబంధించిన విరాళాల చోరీ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. చోరీకి గురైన విరాళాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసేవారు “బహుశా నిజమైన భక్తితో విరాళం ఇచ్చి ఉండకపోవచ్చు” అని ఆయన అనడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
భక్తుల విరాళాలను తిరిగి ఇవ్వాలన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్‌పై స్పందిస్తూ మహానా ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్బును తిరిగి కోరుకునే వారు “నిజమైన” భక్తితో విరాళం ఇచ్చి ఉండకపోవచ్చని ఆయన పేర్కొనడంతో ఈ వివాదం మొదలైంది.
ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (SP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో, తన వ్యాఖ్యలు కేవలం దిగ్విజయ్ సింగ్‌ను ఉద్దేశించి చేసినవే తప్ప సాధారణ భక్తులను ఉద్దేశించి కాదని ఆ సీనియర్ బీజేపీ నేత స్పష్టం చేశారు. “మేము సమర్పించిన కానుకలు చోరీకి గురికాలేదు, ఎందుకంటే అయోధ్యలో అద్భుతమైన రామ్ మందిరం రూపంలో అవి మనకు కనిపిస్తున్నాయి” అని మహానా ‘PTI వీడియోస్’తో అన్నారు.
చోరీ ఆరోపణలు కేవలం కానుకలలోని కొంత భాగానికి మాత్రమే సంబంధించినవని ఆయన పేర్కొన్నారు. అలాగే, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే ఏర్పాటైందని, నిందితులను అరెస్టు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు.
“అక్కడ కొందరు వ్యక్తులు చోరీకి పాల్పడటం దురదృష్టకరం. ప్రభుత్వం SITని ఏర్పాటు చేసింది, చర్యలు తీసుకుంది, నిందితులను జైలుకు పంపింది. ఎవరైనా సరే, వారి హోదాతో సంబంధం లేకుండా శిక్షార్హులు,” అని ఆయన అన్నారు.
తన మునుపటి వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ, దిగ్విజయ్ సింగ్ తన విరాళాన్ని తిరిగి ఇవ్వాలని కోరిన దానికి ప్రతిస్పందనగానే తాను అలా అన్నానని మహానా చెప్పారు. “దిగ్విజయ్ సింగ్ తన డబ్బును తిరిగి ఇవ్వాలని అన్నప్పుడు, బహుశా ఆయన భక్తితో విరాళం ఇచ్చి ఉండకపోవచ్చని నేను అన్నాను. ఎందుకంటే భక్తితో సమర్పించిన డబ్బును ఎవరూ తిరిగి అడగరని ఆయన అన్నారు.
భక్తులు ఇచ్చిన విరాళాలన్నీ చోరీకి గురయ్యాయని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. “ట్రస్ట్ ఖాతాల్లో ఉన్న డబ్బు భక్తులదే. భక్తులు ఇచ్చిన విరాళాలన్నీ చోరీకి గురయ్యాయని ఎవరైనా ఎలా అనగలరు? చోరీ జరగడం దురదృష్టకరం, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు, కానీ భక్తిని డబ్బుతో కొలవలేము,” అని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ వివరణ రాజకీయ వివాదాన్ని చల్లార్చలేకపోయింది. “అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ప్రకారం…ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదు, భక్తుల ఉద్దేశాల్లోనే లోపం ఉందని అర్థం,” అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ‘X’ (ట్విట్టర్) వేదికగా పేర్కొంది.
బీజేపీ ప్రభుత్వం ఇక “ప్రజల విశ్వాసాన్ని ఆడిట్” (పరిశీలన) చేస్తుందా అని కూడా ఆ పార్టీ ప్రశ్నించింది. “ఉత్తరప్రదేశ్‌లో నేరస్తులు రెచ్చిపోతుంటే, అధికారంలో ఉన్నవారు ఇలాంటి విచిత్రమైన వాదనలు చేస్తున్నారు,” అని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.
మహానా వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ (SP) మీడియా విభాగం “అత్యంత సిగ్గుచేటు, ఖండించదగినవి”గా అభివర్ణించింది. “సతీష్ మహానా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. అసెంబ్లీ స్పీకర్ పదవికి తగిన గౌరవంతో ఆయన మాట్లాడాలి. ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడకూడదు” అని ఆ పార్టీ పేర్కొంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తాము తరచుగా విమర్శించినప్పటికీ, అనుభవజ్ఞుడైన రాజ్యాంగబద్ధమైన అధికారిగా మహానా మరింత సంయమనం పాటిస్తారని ఆశించినట్లు పార్టీ తెలిపింది.
మరోవైపు, రామ జన్మభూమి ఉద్యమాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయడంపై మహానా ప్రశ్నించారు. “రామ జన్మభూమి ఉద్యమాన్ని వ్యతిరేకించినవారు, ‘జై శ్రీరామ్’ నినాదం ఇచ్చినందుకు ప్రజలను జైలుకు పంపినవారు, ఆలయ నిర్మాణం ముందు లేదా తర్వాత ఎప్పుడూ ఆలయాన్ని సందర్శించనివారు ఇప్పుడు రామమందిరం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది,” అని ఆయన అన్నారు.
దిగ్విజయ్ సింగ్ డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ…ఒకవేళ తాను భక్తితో విరాళం ఇవ్వలేదని ఆయన భావిస్తే, తన డబ్బు తిరిగి కావాలనుకుంటే, ట్రస్ట్ దానిని తిరిగి ఇవ్వగలదు లేదా నేనే తిరిగి ఇస్తాను.” ఆలయ విరాళాల నిర్వహణలో ముస్లింలు ఎవరైనా ఉండి ఉంటే ఈ చోరీ జరిగి ఉండేది కాదన్న వ్యాఖ్యలను కూడా ఆయన వ్యతిరేకించారు. “అంటే హిందూ సమాజం మొత్తం నిజాయితీ లేనిదా? ఇలాంటి వ్యాఖ్యలు హిందూ సమాజానికి ఆమోదయోగ్యం కాదు,” అని ఆయన అన్నారు.
మరోవంక ఆరోపిత నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు అధికారులు విచారణను ముమ్మరం చేశారు. నిధులలో కొంత భాగాన్ని వడ్డీ ఆధారిత రుణాలలో, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టారని కూడా దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
కాగా, రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు జూన్ మొదటి వారంలో వెలుగులోకి వచ్చాయి, దీని తరువాత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ఒక సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. సిట్ తన ప్రాథమిక నివేదికను సమర్పించిన తర్వాత, జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. దీని ఫలితంగా ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
దర్యాప్తు సమయంలో, పోలీసులు పలువురు నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యధికంగా అవినాష్ శుక్లా నుంచి రూ. 20.39 లక్షలు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ, ‘రామరాజ్య కోష్’ అని రాసి ఉన్న ఒక విరాళాల పెట్టెను కూడా స్వాధీనం చేసుకున్నారు.
''जिन्होंने सच्ची श्रद्धा से दान नहीं किया, राम मंदिर में उन्हीं का चढ़ावा चोरी हुआ''
— Congress (@INCIndia) July 15, 2026
– सतीश महाना, यूपी विधानसभा अध्यक्ष
राम मंदिर में चोरी का महापाप हुआ है, लेकिन BJP के नेता भक्तों की श्रद्धा पर ही सवाल उठा रहे हैं।
👉 क्या देश के करोड़ों रामभक्त इन्हें माफ करेंगे? pic.twitter.com/pMu1muC2MI
