టెహరాన్: హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలను, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగితే, ఇరాన్‌లోని ప్రధాన వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈ హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌లోని పౌర, ఇంధన మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తే, తాము కూడా ‘కంటికి కన్ను’ (Eye for an eye) చొప్పున ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది.
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘీ మాట్లాడుతూ… ప్రతీకారం తప్పదని ఎక్స్ వేదికగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు.
ఒకవేళ అమెరికా దాడులకు పాల్పడితే, ఇరాన్‌కు మద్దతు ఇచ్చే దేశాలు, అమెరికా మిత్రదేశాల ఇంధన నెట్‌వర్క్‌లు, చమురు, విద్యుత్ సరఫరాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ మిలిటరీ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.
పశ్చిమాసియా ఘర్షణలు మళ్లీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ దేశాధినేతల తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొద్ది రోజుల కిందట యుద్ధ విరమణకు సంబంధించి కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని లెక్కచేయకుండా ఇరు దేశాలు మళ్లీ భీకర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
ఇదిలా ఉండగా…ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధానికి దాదాపు 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు యూఎస్ సెక్రటరీ ఆఫ్ వార్ ‘పీట్ హెగ్సేత్’ వెల్లడించారు. భారత కరెన్సీలో చూస్తే ఇది దాదాపు రూ. 3.6 లక్షల కోట్లకుపైనే ఉంటుందని అంచనా.


