లక్నో: సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు అనంతరం 2020 ఫిబ్రవరిలో కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా రామ మందిర నిర్మాణ ప్రాజెక్ట్ మేనేజర్ జగదీష్ అఫ్లేను తన తొలి కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది.
మహారాష్ట్రకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, మందిరం ప్రారంభమైనప్పటి నుంచి దాని నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న అఫ్లేను నియమించే ప్రతిపాదన, సెప్టెంబర్ 2న జరిగే ట్రస్ట్ కార్యనిర్వాహక సమావేశంలో ఆమోదం కోసం వచ్చే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. విస్తృత పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ట్రస్ట్ ఇటీవల కార్యదర్శి పదవిని సృష్టించింది, అలాగే ఒక అధికార ప్రతినిధిని కూడా నియమించనుంది.
పుణె నివాసి అయిన అఫ్లే, ఐఐటి బొంబాయి నుండి ఎం.టెక్‌తో సహా ఇంజనీరింగ్ డిగ్రీలు పొందారు. భారతదేశానికి తిరిగి రాకముందు ఆయన యూరప్, యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేసినట్లు చెబుతున్నారు. నిర్మాణం ప్రారంభమైనప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సిఫార్సు మేరకు ఆయన రామ మందిర ప్రాజెక్టులో గౌరవ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేరారు. అప్పటి నుండి తన కుటుంబంతో కలిసి అయోధ్యలోనే ఉంటున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ విషయాన్ని పదేపదే లేవనెత్తి, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ, జవాబుదారీతనం కోరడంతో, విరాళాల దుర్వినియోగం ఆరోపణలు మొదటిసారిగా జాతీయ రాజకీయ దృష్టిని ఆకర్షించాయి.
భక్తులు సమర్పించిన నగదు కానుకల దుర్వినియోగం ఆరోపణలపై ట్రస్ట్ స్వయంగా విచారణ కోరిన కొన్ని వారాల తర్వాత ఈ పునర్వ్యవస్థీకరణ జరిగింది. జూన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు, ఎనిమిది మంది నిందితుల అరెస్టు జరిగాయి.
ఈ వివాదం అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలకు కూడా దారితీసింది. దీంతో ట్రస్ట్ పరిపాలనా నిర్మాణంలో విస్తృతమైన మార్పులకు కారణమైంది.
అయితే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ వివాదాన్ని ఆరోపిత నీట్ పేపర్ లీక్‌తో ముడిపెట్టారు. ఆలయ విరాళాలను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహిస్తుందని నమ్మలేమని ఆయన పేర్కొన్నారు.
“భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలను రక్షించుకోలేని వారి నుండి, పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టడం లేదా పరీక్షలు రద్దు కాకుండా చూడటం వంటివి ఆశించలేము. ప్రజల విశ్వాసంతో చెలగాటం ఆడేవారు, మన యువత భవిష్యత్తుతో కూడా చెలగాటం ఆడగలరని” పార్లమెంటు భవన సముదాయంలో అఖిలేష్ విలేకరులతో అన్నారు.
ఈ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని దేశానికి “అతిపెద్ద సంక్షోభం”గా అభివర్ణించిన అఖిలేష్‌యాదవ్, “ఈ ప్రభుత్వం పోయేంత వరకు సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి” అని అన్నారు.
ఇదిలా ఉండగా, అయోధ్య నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ మాట్లాడుతూ… ప్రధాన నిందితుడిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. “ఈ విషయాన్ని బయటపెట్టినందుకు అఖిలేష్ యాదవ్‌ను అభినందిస్తున్నాను. కానీ, బీజేపీ ప్రభుత్వం పెద్ద తలకాయలను (ప్రధాన నిందితులను) కాపాడేందుకు ప్రయత్నించడం దురదృష్టకరం. ఇది సాధారణ చోరీ కాదు. ఇది శ్రీరాముని కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న దోపిడీ” అని ఆయన అన్నారు.
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కూడా బీజేపీ ఎంపీ ప్రసాద్ జోస్యం చెప్పారు. “అయోధ్య కారణంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అయోధ్య కారణంగానే ఇది పడిపోతుంది. 2027లో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ కనీసం 50 సీట్లు కూడా గెలవదు. ఇది అవధేష్ ప్రసాద్ మాటలు కావు; ఇది ప్రభు శ్రీరాముని వాణి,” అని ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ అన్నారు.

