చాపెల్ హిల్ (నార్త్ కరోలినా): అమెరికా విధించిన ఆంక్షల నుంచి తప్పించుకోవడంలో ఇరాన్‌కు సహాయపడే దేశాలపై జరిమానా ఎదుర్కోవాల్సి రావచ్చని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో హెచ్చరించారు. అదే సమయంలో భారత్, ఇరాన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు, అధికారులతో జరిపిన సమావేశం గురించి, అలాగే ఆ రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నాయన్న వార్తల గురించి అడిగినప్పుడు రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.
“భారత్, ఇరాన్ మధ్య వాణిజ్య ఒప్పందం ఉన్నట్లు నాకు అనిపించడం లేదని” ‘ది బ్రయాన్ కిల్మీడ్ షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో అన్నారు. దేశాలు స్వతంత్ర విదేశాంగ విధానాలను అనుసరిస్తాయని,టెహ్రాన్‌తో సంబంధాలు కొనసాగిస్తాయని ఆయన అంగీకరించారు. వాషింగ్టన్ కూడా ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిందని ఆయన పేర్కొన్నారు.
“వాస్తవానికి, ప్రతి దేశం తమ సొంత విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటుంది, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇరాన్ ప్రభుత్వంతో సంభాషిస్తుంటాయి,” అని రూబియో అన్నారు. “అంటే, జరిగిన కొన్ని చర్చల సందర్భంలో మేము కూడా ఇరాన్ ప్రభుత్వ వర్గాలతో సమావేశమయ్యామని ఆయన అన్నారు. అయితే, ఆంక్షలను తప్పించుకోవడంలో లేదా ఆదాయాన్ని ఆర్జించే మార్గాలను ఏర్పాటు చేసుకోవడంలో టెహ్రాన్‌కు ఏ దేశమూ సహాయపడకూడదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారని రూబియో చెప్పారు.
“ఆదాయాన్ని సమకూర్చుకునే విధానాలను రూపొందించడంలో ఏ దేశమూ వారికి సహాయపడకూడదు; ఎందుకంటే ఆ ఆదాయాన్ని వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి, అణు ఆయుధాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఒకవేళ దేశాలు అలా చేయడానికి నిర్ణయించుకుంటే, మేము వాటిపై కూడా ఆంక్షలు విధించాల్సి ఉంటుంది.”
ఇరాన్ అణు ఆయుధాన్ని కలిగి ఉండకుండా అడ్డుకోవడమే ట్రంప్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రూబియో చెప్పారు. “ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండటానికి అనుమతించం, ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ పదవిలో ఉన్నంత కాలం అది జరగదు,” అని ఆయన అన్నారు. టెహ్రాన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి వాషింగ్టన్ ప్రధానంగా ఆర్థికపరమైన మార్గాలను అనుసరిస్తుందని, అయితే అవసరమని భావించినప్పుడు సైనిక శక్తిని ఉపయోగించే హక్కును కూడా కలిగి ఉందని సెక్రటరీ ఆఫ్ స్టేట్ తెలిపారు.
“వారు అణు ఆయుధాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నంత కాలం లేదా దానిని కోరుకుంటున్నట్లు చెబుతున్నంత కాలం, వారు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది; ఆ మూల్యం ప్రధానంగా ఆర్థికపరమైనదిగా ఉంటుంది,” అని రూబియో అన్నారు. ఇరానియన్ల జీవితాలను మెరుగుపరచడానికి కాకుండా, సాయుధ గ్రూపులకు మద్దతు ఇవ్వడానికి టెహ్రాన్ తన ఆర్థిక వనరులను ఉపయోగిస్తోందని రూబియో ఆరోపించారు.
“వారికి రెండు విషయాల కోసం డబ్బు కావాలి — ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి, అంతిమంగా అణ్వాయుధాన్ని పొందడానికని ఆయన అన్నారు.అది జరగడానికి మేము అనుమతించలేము.”
హర్ముజ్ జలసంధి గురించి మాట్లాడుతూ, ఇరాన్ వాణిజ్య నౌకలపై కాల్పులు కొనసాగించిందని, అయితే అమెరికా ఆ వ్యూహాత్మక జలమార్గంలో అమర్చిన మందుపాతరలను ధ్వంసం చేసిందని రూబియో చెప్పారు.
“కాబట్టి, జలసంధిలో మా బలగాలకు మరియు ప్రపంచ నౌకాయానానికి తక్షణ ముప్పు కలిగించే వాటిని మేము లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తాము,” అని ఆయన అన్నారు. “జలసంధులు తెరిచే ఉంటాయి, మరియు అవి ఇరాన్ నియంత్రణలో ఉండవు.”
భారత్, ఇరాన్‌లకు దీర్ఘకాలంగా దౌత్య, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధిలో కూడా భారత్ పాలుపంచుకుంది. ఈ ఓడరేవు ద్వారా పాకిస్థాన్ గుండా వెళ్లకుండా ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు వాణిజ్య మార్గం లభిస్తుంది.


