న్యూఢిల్లీ: అమెరికాలో జరిగిన 65 మిలియన్ డాలర్ల మెడికేర్ మోసంలో భారత సంతతి వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని యూఎస్ అధికారులు తేల్చారు. అమెరికాలో మెడికేర్ పథకాన్ని తన స్వార్థానికి వాడుకుని.. భారీ మొత్తంలో నకిలీ మెడికల్ క్లెయిమ్‌లు సమర్పించిన కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న భారతీయుడు మహ్మద్ ఖదీర్‌ఖాన్ హైదరాబాద్‌కు చేరినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నగర పోలీసులు అతని ఆచూకీ కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగి గాలిస్తున్నట్లు తెలిసింది.
కాగా, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన టెక్సాస్ అధికారులు ఖదీర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయాడు. ఈ క్రమంలో అతడి పేరును.. మోస్ట్ వాంటెడ్’ జాబితాలో చేర్చారు.
మెడికేర్ అనేది అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చే ఒక ఆరోగ్య సంరక్షణ ప్రయోజన పథకం. ఈ కుంభకోణంలో “రీయింబర్స్‌మెంట్‌కు అనర్హమైన ప్రయోగశాల జన్యు పరీక్షల కోసం నిందితుడు క్లెయిమ్‌లను సమర్పించాడు.”
ఆఫీస్ ఆఫ్ ది ఇన్స్పెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (OIG-HHS) ప్రకారం, అతను సుమారు 93 మిలియన్ డాలర్ల మోసపూరిత మెడికేర్ క్లెయిమ్‌లను సమర్పించగా, దాని ఫలితంగా కనీసం 65 మిలియన్ డాలర్ల చెల్లింపులు జరిగాయి.
“ఈ పథకంలో భాగంగా ఆగస్టు 2023 – అక్టోబర్ 2024 మధ్య, సదరు నిందితుడు వైద్యులకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని ఉపయోగించి, ఆ వైద్యులకు ఎటువంటి చికిత్సా సంబంధం లేని లబ్ధిదారుల కోసం జన్యు పరీక్షల క్లెయిమ్‌లను సమర్పించాడని ఆరోపణలు ఉన్నాయి.
ఖదీర్‌ఖాన్ హైదరాబాద్‌కు వచ్చినట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయం ద్వారా నగరానికి వచ్చిన ప్రయాణికుల వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
