హైదరాబాద్: సాహితి ఇన్ఫ్రాటెక్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 27న ఈడీ ఎదుట హాజరు కావాలని గాంధీని ఆదేశించారు. ఎమ్మెల్యే, సాహితి ఇన్ఫ్రాతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన సుమారు రూ. 2.1 కోట్ల లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే అరికెపూడి గాంధీకి సంబంధించిన ఖాతాల ద్వారా సుమారు రూ.2.1 కోట్ల మేర నిధులు వెళ్లినట్లు గుర్తించినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ మొత్తానికి సంబంధించిన లావాదేవీలు ఎప్పుడు జరిగాయి.. ఎలాంటి ప్రయోజనం కోసం నిధులు బదిలీ అయ్యాయి.. వాటికి సాహితి ఇన్ఫ్రా కార్యకలాపాలతో ఏమైనా సంబంధం ఉందా అనే అంశాలపై రేపు జరిగే విచారణలో ఈడీ అధికారులు వివరాలు కోరే అవకాశం ఉంది.
కాగా, సాహితి ఇన్ఫ్రాటెక్, ఫ్లాట్లు, విల్లాల ప్రీ-లాంచ్ ఆఫర్ల ద్వారా గృహ కొనుగోలుదారుల నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ నిధులలో కొంత భాగాన్ని దారి మళ్లించిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది. ఈ దర్యాప్తుకు సంబంధించి ఈడీ పలు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, ఆస్తులను కూడా జప్తు చేసింది.
గతంలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. మరో విడతలో రూ.12.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. ఇప్పటివరకు 56 బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను 2024లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


