న్యూయార్క్: ప్రపంచ అత్యున్నత వేదిక ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సాక్షిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తీవ్ర నిరసన సెగ తగిలింది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం గళమెత్తింది. నెతన్యాహు ప్రసంగిస్తున్న సమయంలోనే పలు దేశాల దౌత్యవేత్తలు సభను బహిష్కరించి (వాక్‌అవుట్ చేసి) బయటకు వెళ్ళిపోవడం దౌత్యవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఒకవైపు ఐరాస సభా మందిరంలో ఖాళీ కుర్చీలు ప్రత్యక్షం కాగా, మరోవైపు న్యూయార్క్ వీధులు పాలస్తీనా అనుకూల నిరసనలతో హోరెత్తాయి.
బహిష్కరణే నిరసన ఆయుధంగా.. సెప్టెంబర్ 24న ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు నెతన్యాహు మైక్రోఫోన్ ముందుకు వచ్చారు. గాజాలో తన ప్రభుత్వ సైనిక చర్యలను సమర్థించుకోవడానికి, ఆరోపణలను తిరస్కరించడానికి ఆయన ఈ వేదికను ఉపయోగించుకున్నారు. అయితే, ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే.. డజన్ల కొద్ది దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దౌత్యవేత్తలు తమ సీట్లలో నుంచి లేచి సభను వీడి నిష్క్రమించారు. ఎలాంటి నినాదాలు చేయకుండా, ప్రసంగాలు ఇవ్వకుండా కేవలం సభను బహిష్కరించడం ద్వారానే వారు తమ నిరసనను అత్యంత శక్తివంతంగా చాటారు.
సభలో తనను వ్యతిరేకించిన దౌత్యవేత్తలను నెతన్యాహు ‘నైతిక పిరికిపందలు’ అంటూ తీవ్రంగా విమర్శించినప్పటికీ, కెమెరాల్లో రికార్డైన ఖాళీ కుర్చీల దృశ్యాలను ఆయన మార్చలేకపోయారు. ఇదే సమయంలో న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీని ‘యూదు వ్యతిరేకి’ అంటూ నెతన్యాహు వ్యక్తిగత విమర్శలకు దిగడం గమనార్హం.
వీధుల్లో హోరెత్తిన ‘ఫ్రీ పాలస్తీనా’ నినాదాలు ఐరాస ప్రధాన కార్యాలయం వెలుపల పరిస్థితి పూర్తిగా భిన్నంగా సాగింది. వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించి పోలీసుల ఆంక్షలను ధిక్కరించారు. పాలస్తీనా జెండాలు చేబూని “గాజాను బతకనివ్వండి”, “ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఇవ్వడం ఆపండి” అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. “నెతన్యాహు.. నువ్వు దాక్కోలేవు, నీపై నరమేధ నేరం మోపుతున్నాము” అంటూ ఆందోళనకారులు మండిపడ్డారు.
పోలీసులు జరిపిన అరెస్టులలో ఆస్కార్ అవార్డు గ్రహీత సరండన్, ప్రముఖ నటి హన్నా ఐన్‌బైండర్, సిటీ కౌన్సిల్ సభ్యుడు చి ఒస్సే తదితర ప్రముఖులు అరెస్టవడం ఈ నిరసనకు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ‘జ్యూవిష్ వాయిస్ ఫర్ పీస్’ ఆధ్వర్యంలో యూదు అమెరికన్లు సైతం ఈ ఆందోళనలో పెద్దఎత్తున పాల్గొనడం విశేషం. నెతన్యాహు విధానాలను వ్యతిరేకిస్తున్నది కేవలం శత్రువులు కాదనీ, స్వయంగా యూదులే ఆయన యుద్ధనీతిని తప్పుబడుతున్నారనే వాస్తవానికి ఇది అద్దం పట్టింది.
మారిన సమీకరణాలు.. అమెరికా వంటి అగ్రరాజ్యాల మద్దతు ఇజ్రాయెల్‌కు ఇంకా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాల ప్రజాభిప్రాయం మాత్రం వేగంగా మారుతోందనేదానికి ఈ నిరసనలే నిదర్శనం. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) ఇప్పటికే నెతన్యాహుపై యుద్ధ నేరాల కింద అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో.. ఐరాస లోపల దౌత్యవేత్తల వాక్‌అవుట్, బయట వీధుల్లో పౌరుల ఆగ్రహం ఇజ్రాయెల్ ఒంటరి అవుతోందనే సంకేతాలను స్పష్టంగా ఇస్తున్నాయి. నెతన్యాహు తన వాదనను వినిపించినప్పటికీ.. ఆ రోజు చరిత్రలో మాత్రం ఆయన ప్రసంగంతో పాటు ‘ఖాళీ కుర్చీలు, వీధుల్లో నినాదాలే’ ప్రధానంగా నిలిచిపోయాయి.
