పశ్చిమబెంగాల్: కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ (SRFTI) క్యాంపస్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారం రోజుల క్రితం జరిగిన ఘర్షణలకు కొనసాగింపుగా, ‘భారతమాత, స్వామి వివేకానందను అగౌరవపరిచారనే’ ఆరోపణలతో హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు నిన్న ఇన్స్టిట్యూట్ వద్దకు భారీగా చేరుకున్నారు. “ప్రతీకారం” తీర్చుకుంటామంటూ ముందుగానే హెచ్చరించడంతో, ఈ ఆందోళన విద్యార్థులు, అధ్యాపకుల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.
పోలీసుల వైఫల్యం – బారికేడ్ల ధ్వంసం
ఈ ప్రతిపాదిత నిరసన హింసాత్మకంగా మారవచ్చని విద్యార్థులు ముందే అధికారులను అప్రమత్తం చేశారు. క్యాంపస్‌కు కొంత దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి గేట్లను మూసివేసినప్పటికీ, ఆందోళనకారులు వాటిని తోసుకుంటూ ఇన్స్టిట్యూట్ వైపు దూసుకెళ్లారు. ప్రధాన గేటు వద్ద పోలీసులు నిరోధించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆందోళనకారులు గేట్లను బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తూ, లోపల ఉన్న వారిపై రాళ్లు, ఇటుకలు, నీళ్ల సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రొఫెసర్ దేబాశిస్ సేన్‌శర్మ తలకు ఇటుక దెబ్బ తగిలి గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య పరస్పర రాళ్ల దాడి జరగడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. గేట్ వద్ద ఉన్న బి.ఆర్. అంబేద్కర్ పోస్టర్‌ను కూడా చించివేశారని విద్యార్థులు ఆరోపించారు.
అసలు వివాసానికి కారణం ఏమిటి?
సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన ఘర్షణే ఈ తాజా ఉద్రిక్తతలకు తక్షణ కారణం. ఆ రోజు ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న అఖిల్ భారతీయ గ్రాహక్ పంచాయత్ (ఏబీజీపీ), ఇన్స్టిట్యూట్ అనుమతితో ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ ఆడిటోరియంలో ఒక సమావేశం నిర్వహించింది. క్యాంపస్ లోపల బయటి వ్యక్తులు రాజకీయ సమావేశం నిర్వహించడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
కాగా, తమ అనుమతి లేకుండా బయటి వ్యక్తులు వచ్చి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపించగా, తమ కార్యక్రమానికి విద్యార్థులే అంతరాయం కలిగించారని, భారత్ మాత, స్వామి వివేకానంద చిత్రాలను చించివేసి తమ సభ్యులను నిర్బంధించారని ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న సంస్థ చెబుతోంది.
ఈ ఘటనపై నాలుగు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కోల్‌కతా పోలీస్ జాయింట్ కమిషనర్ (క్రైమ్) కునాల్ అగర్వాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఎస్ఐటీ తన ప్రాథమిక నివేదికను అక్టోబర్ 1వ తేదీన ప్రభుత్వానికి సమర్పించింది. అయితే నివేదికను బహిర్గతం చేయకపోవడంతో విద్యార్థులు పారదర్శకతను డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ, సినీ ప్రముఖుల స్పందనలు
మహనీయులను అవమానించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని, వారి ప్రవర్తన మారే వరకు జాతీయవాద నిరసనలు కొనసాగుతాయని బీజేపీ నాయకుడు సాయంతన్ బసు: స్పష్టం చేశారు.
కాగా, టీఎంసీ నేత ప్రతీకుర్ రెహమాన్ మాట్లాడుతూ… విద్యార్థులను రక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. “ఇది పోలీసుల వైఫల్యం. విద్యార్థులు ముందుగానే రక్షణ కోరినప్పటికీ, పోలీసులు ఆ దాడిని అడ్డుకోలేకపోయారు. SRFTIపై దాడి జరగడం ఇది రెండవసారి, అయినా పోలీసులు మౌనంగా ఉండిపోయారు,” అని ఆయన అన్నారు.
వారం రోజుల తర్వాత కూడా ప్రతీకారం పేరుతో మళ్లీ దాడికి దిగడం చాలా ఆందోళనకరమని, సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న బీజేపీ నాయకులు దీనిపై దృష్టి పెట్టాలని నటుడు బాద్షా మైత్రా (CPI(M)) కోరారు.
మరోవంక క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా యాజమాన్యం కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని, తమకు పూర్తి రక్షణ కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

