ముంబయి: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుండి తొలగించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో భారీ నిరసన చేపట్టడానికి కొన్ని రోజుల ముందే, కాక్రోచ్ జనతా పార్టీ అగ్ర నాయకులను అరెస్టు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు చేశారు. అక్టోబర్ 10న జరగబోయే ఆందోళనను అణచివేయడానికే కేంద్రం ఈ వ్యూహాన్ని రచిస్తోందని ఆయన ‘X’ వేదికగా పేర్కొన్నారు.
ప్రభుత్వం జైలుకు పంపాలని భావిస్తున్న వారిలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు అశుతోష్, రత్నల పేర్లు ఉన్నాయని దాస్ వెల్లడించారు. అయితే, ఈ అణచివేత చర్యలు ఖచ్చితంగా వికటిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకులు జైలుకు వెళ్లినా, లేదా అంతకంటే తీవ్రమైన శిక్షకు గురైనా భయపడేది లేదని, విడుదల కాకపోయినా పార్టీ యువ మద్దతుదారులు పోరాటాన్ని ఉధృతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అక్టోబర్ 10న ప్రారంభం కానున్న ఈ నిరసనలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 10 శనివారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది.
శివాజీ పార్క్ ర్యాలీలో దీప్కే “చలో ఢిల్లీ” నినాదం
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్ లో జరిగిన ఒక భారీ ర్యాలీలో అభిజీత్ దీప్కే ఈ ఢిల్లీ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించారు. ఒకవేళ సీఈసీ కుమార్ తక్షణమే రాజీనామా చేయకపోతే, దేశవ్యాప్తంగా ఉన్న యువత దేశ రాజధానికి పాదయాత్ర చేస్తారని హెచ్చరించారు. ఈ ప్రణాళికాబద్ధమైన నిరసనను ఆయన “జంతర్ మంతర్ 2.0” గా అభివర్ణిస్తూ, యువతకు “చలో ఢిల్లీ” అని పిలుపునిచ్చారు.
వేలాది మంది యువకులు హాజరైన ఈ ముంబై ర్యాలీలో దీప్కే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, సీఈసీ కుమార్‌లను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటంతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై కూడా విమర్శలు సంధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా గాంధీని భారతదేశ ఆత్మగా, బి.ఆర్. అంబేద్కర్‌ను వెన్నెముకగా, జవహర్లాల్ నెహ్రూను మెదడుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ ఎప్పటికీ ఆ ముగ్గురి కంటే గొప్పవారు కాలేరని వ్యాఖ్యానించారు. దేశం నాథూరామ్ గాడ్సే సూత్రాలపై కాకుండా గాంధీ మార్గంలోనే నడుస్తుందని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ వ్యాక్సిన్లు, ఇప్పుడు ఓటర్ల జాబితా ఉదహరిస్తూ.. ప్రధాని మోదీ నిరంతరం ప్రజలను క్యూలలో నిలబెడుతున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుండి లక్షలాది మంది పేర్లను తొలగించడం ద్వారానే, గతంలో మోదీ ప్రభంజనం ఉన్నప్పుడు కూడా గెలవని రాష్ట్రాలను సైతం ఇప్పుడు బీజేపీ గెలుచుకుందని ఆరోపించారు. అలాగే బీజేపీ కేవలం ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ మాత్రమే కాకుండా, ‘ఒక దేశం, ఒక పార్టీ’ నిరంకుశత్వాన్ని కోరుకుంటోందని విమర్శించారు.
ముంబై పోలీసులతో ఘర్షణలు
ఈ ర్యాలీకి ఒక రోజు ముందే, అంటే అక్టోబర్ 1 గురువారం నాడు, సీఈసీ కుమార్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని మద్దతుదారులతో మెరైన్ డ్రైవ్ వద్ద కనిపించిన దీప్కేను ముంబై పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత విడుదల చేశారు.
కాగా, రాజకీయ వ్యవస్థపై ఆన్‌లైన్ వ్యంగ్యంగా సీజేపీ మొదట మే 16న నిరసన ప్రారంభించింది. దీని పేరు బీజేపీ పేరును పోలి ఉంది. భారతదేశంలో మే 21న పార్టీ అధికారిక ‘X’ ఖాతాను నిలిపివేశారు.
