న్యూఢిల్లీ: విద్యార్థుల నిరసనలలో “ఫ్రీ పాలస్తీనా” నినాదం ఎప్పుడూ ఎందుకు వినిపిస్తుందో, దానిని ఉపయోగించవద్దని భారతీయ జనతా పార్టీ ఎందుకు హెచ్చరిస్తుందో అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా వివరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాలను, నిరసనలను అణచివేసే ప్రయత్నాలను ప్రతిఘటించడానికి యువత ఇలాంటి అంతర్జాతీయ స్వేచ్ఛా నినాదాలను కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నారని విశ్లేషించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను, కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జవాబుదారీతనాన్ని కోరుతూ, ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లోని అవకతవకలకు వ్యతిరేకంగా చురుకుగా గళం విప్పిన బోరా, ‘ఫ్రీ పాలస్తీనా’ నినాదం, ఈ ఉద్యమం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం, సానుభూతి, మానవ స్వేచ్ఛలో పాతుకుపోయిందని వాదించారు. ఇది బీజేపీ మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ల సైద్ధాంతిక వైఖరికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
“ఒక మనిషి మరో మనిషి పట్ల ఏమి చేయవచ్చనే హద్దులను దాటడానికి పాలస్తీనా ఒక స్పష్టమైన ఉదాహరణ. పాలస్తీనా ప్రజలు, లేదా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలిచే వారి ప్రాథమిక పోరాటం ఇదే: శక్తిమంతులు శక్తిహీనులను అణచివేయడం కొనసాగించలేరు,” అని ఆమె ది టెలిగ్రాఫ్ ఆన్‌లైన్‌తో అన్నారు . సహానుభూతి అంటే మానవత్వంతో ఉండటమేనని, దాని ప్రాముఖ్యతను నిజంగా అర్థం చేసుకున్న ఎవరైనా పాలస్తీనాకు సంఘీభావంగా నిలుస్తారని ఆమె అన్నారు.
“కేవలం అధికారం ఉంది కాబట్టి చంపడానికి, గాయపరచడానికి, అత్యాచారం చేయడానికి, మొత్తం నాగరికతలను నాశనం చేయడానికి ఉన్న ఈ సంపూర్ణ స్వేచ్ఛను కొనసాగనివ్వలేము. మానవ సమాజంగా, మనలో ఏదైనా పవిత్రమైనది ఉందంటే, అది మనలో సహానుభూతి ఉండటమే. సానుభూతి ఎందుకు ముఖ్యమో, మానవ సమాజం దేనిని పరిరక్షించుకోవాలో నిజంగా అర్థం చేసుకున్న ప్రజలే పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తారని” ఆమె అన్నారు. ఒకే సమాజం ఉండా, మిగతావాటిని నిర్మూలించాలనే ఒక భావజాలాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఇజ్రాయెల్ భావిస్తున్నాయని నేహా బోరా అన్నారు.
“ప్రామిస్‌డ్ లాండ్… హీబ్రూ బైబిల్ ప్రకారం, అబ్రహాముకు, అతని సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన కనాను ప్రాంతమే (ఆధునిక ఇజ్రాయెల్,పాలస్తీనా) ఘనమైన గతం అనే తమ భావనల ఆధారంగా సమాజంలోని ఒక వర్గాన్ని నిర్మూలించాలని వారు [ఇజ్రాయెల్] భావిస్తారు. అటువంటి రాజకీయాలనే మనం ఇక్కడ (భారతదేశంలో) ఆర్‌ఎస్‌ఎస్‌లో చూస్తున్నాము. ఇది సమాజంలోని మరో వర్గాన్ని ‘ఇతరులు’గా పరిగణిస్తూ, వారిపై హింసను, ఆ పౌరుల సామూహిక హత్యాకాండను సమర్థిస్తుందని” విద్యార్థి నేత నేహా బోరా అన్నారు.
“బీజేపీ కేవలం పార్లమెంటులో అధికారాన్ని కలిగి ఉండటమే కాదు, ఈ దేశంలోని సామాన్య పౌరుల జీవితాల్లోనూ తన ప్రభావాన్ని కలిగి ఉంది. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ లేదా బీజేపీ ఎల్లప్పుడూ ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తాయని” ఆమె అన్నారు.
