టెహ్రాన్: హర్ముజ్ జలసంధిలో చమురు స్మగ్లింగ్ కార్యకలాపాలను అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి నడిపిస్తున్నారని ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ భద్రతా అధికారి ఆరోపించారు. ఈమేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ, వారాంతంలో ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేశారు.
అడ్మిరల్ బ్రాడ్ కూపర్, యూఏఈ సైన్యాన్ని ఉపయోగించి ఈ కార్యకలాపాలను నిర్దేశిస్తున్నారని, ఐదు లేదా ఆరు చిన్న పడవల ద్వారా పెద్ద ట్యాంకర్లకు చమురును తరలిస్తున్నారని రెజాయీ చెప్పారు. గత రెండు మూడు నెలలుగా, ఈ కార్యకలాపాలలో పాల్గొంటున్న ఐదు లేదా ఆరు నౌకలపై ఇరాన్ దళాలు ప్రతి రాత్రి దాడులు చేస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే రెజాయీ ఆరోపణలపై అమెరికా, యూఏఈ వెంటనే స్పందించలేదు.
కాగా, హర్ముజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉందని రెజాయ్ స్పష్టం చేసారు. హర్ముజ్ జలసంధి తెరిచే ఉందని ట్రంప్ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇరాన్ విధించిన ఏడు నిబంధనలను అంగీకరించే వరకు హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అమెరికా గనుక మళ్లీ ఇరాన్ పై దాడులకు దిగితే ప్రాంతీయంగా ఉన్న $2 ట్రిలియన్ల విలువైన అమెరికా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al), సాంకేతిక మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని హెచ్చరించారు.
