హైదరాబాద్: తెలంగాణలో, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు లేవని పదేపదే ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యుత్ సరఫరా అంతరాయాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
పంట కోత ప్రారంభం కానున్న నేపథ్యంలో… రాబోయే 20 రోజులు పంటలకు కీలకం కానుండటంతో, 24 గంటలూ నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించడం ద్వారా విద్యుత్ అంతరాయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి అంగీకరించినట్టైంది.
పంట కోత సీజన్ ప్రారంభం కావడంతో, విద్యుత్ అంతరాయాలు, పంట నష్టాల ప్రమాదంపై రైతుల్లో అసంతృప్తి పెరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఈ హెచ్చరిక చేసినట్లు కనిపిస్తోంది. విద్యుత్ కొరత కారణంగా ఏ రైతు కూడా నష్టపోకూడదనే ఆయన పట్టుదల…సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఎల్ నినో ప్రభావంపై చర్చించేందుకు సీఎం మంత్రులతో సమావేశం కానున్నారు.
ఈమేరకు నిన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో కరువు పరిస్థితులు, ఎల్ నినో, విద్యుత్, తాగునీటి సరఫరాలపై జరిగిన సమీక్షా సమావేశంలో, తన ఆదేశాలు ఉన్నప్పటికీ అంతరాయాలు ఎందుకు కొనసాగుతున్నాయని, కొరతను ఊహించి విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు పెంచలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నైని, మహానది నుంచి బొగ్గు సరఫరా అనుసంధానం ఉన్నప్పటికీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడంపై కూడా ఆయన వివరణ కోరారు.
తక్కువ వర్షపాతానికి ఎల్ నినోకారణమని పేర్కొన్న సీఎం… ఈ వాతావరణ వైవిధ్యాన్ని కోవిడ్-19తో పోల్చదగిన సంక్షోభంగా అభివర్ణించారు. వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగే సమన్విత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, నీరు, విద్యుత్ పొదుపుపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.
అయితే, రైతులు పంట నష్టాల ప్రమాదాలను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, విస్తృత సవాళ్లను వివరించడానికి ప్రభుత్వం ఎల్ నినోను ప్రస్తావించినప్పటికీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జెన్కో ఛైర్మన్, ఇతర ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించడం, తగినంత విద్యుత్ సరఫరాపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.
