ముహమ్మద్ ముజాహిద్…✍️
ఫ్రాన్సులో సెప్టెంబర్ మధ్యభాగంలో మొదలైన ఒక చిన్న నిలిపివేత ఉద్యమం నేడు ఆ దేశపు సరిహద్దులను దాటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్రెటెయిల్ శివారు ప్రాంతం నుంచి మొదలైన ఈ విద్యార్థి గర్జన చూస్తుండగానే మార్సే ల్లే నగరాలకు పాకింది. నిరసనకారుల ప్లకార్డులపై కనిపిస్తున్న “మేము జెన్-జీ గెలుస్తాం” అనే నినాదం కేవలం ఒక తరపు నినాదం కాదు; దశాబ్దాలుగా ప్రభుత్వాల విధానాల వల్ల అణచివేయబడుతున్న, నిర్లక్ష్యానికి గురవుతున్న ఒక తరం ఆత్మఘోష. పాఠశాలల్లో మౌలిక వసతులు కరువవడం, భవనాలు శిథిలావస్థకు చేరడం, ఉపాధ్యాయుల కొరత వంటి దైనందిన సమస్యలే ఈ ఉద్యమానికి ఊపిరి పోశాయి. తరగతులలో గంటల తరబడి ఖాళీ పీరియడ్‌లు, క్రమబద్ధం కాని వేళలతో విసిగిపోయిన విద్యార్థులకు తోడుగా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా రోడ్డెక్కారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒక ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు లేదంటూ పెడచెవిన పెట్టే పాలకులను ఉద్దేశించి ఆ పిల్లలు సంధించిన ప్రశ్న అత్యంత ఆలోచనాత్మకమైనది: “జెన్-జీ ఓటు వేయడానికి చిన్నది కావచ్చు, కానీ అణచివేయడానికి, లాఠీలకు, టియర్ గ్యాస్‌కు బలికావడానికి మాత్రం పెద్దదా?” ఈ ఒక్క వాక్యంలో పాలకుల ద్వంద్వ వైఖరి స్పష్టంగా బయటపడుతోంది.
ఆర్థిక సంక్షోభం – పాలకుల ప్రాధాన్యతలు
ఈ అసంతృప్తి వెనుక లోతైన ఆర్థిక సంక్షోభం ఉంది. చమురు, గ్యాస్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యుడిపై ప్రభుత్వం కోతలతో కూడిన బడ్జెట్‌ను రుద్దాలని చూస్తోంది. ఒకవైపు పాఠశాలల బాగు కోసం 10 బిలియన్ యూరోలు ఇవ్వాలని విద్యార్థులు కోరుతుంటే, మరోవైపు దేశ రక్షణ బడ్జెట్‌ను 2017లో ఉన్న 32 బిలియన్ యూరోల నుంచి 2027 నాటికి ఏకంగా 63 బిలియన్ యూరోలకు రెట్టింపు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీడీపీ లోటు 8.5 శాతానికి చేరి, దేశంపై అప్పుల భారం 2.3 ట్రిలియన్ యూరోలు దాటిన తరుణంలో ఈ రక్షణ ఖర్చులు ఎవరి కోసం? రష్యాను అడ్డుకోవడానికో, లేక విదేశాలలో అనవసర సాహసయాత్రలకో? పాలకుల ప్రాధాన్యతలు ఎప్పుడూ సామాన్య ప్రజల చదువు, సంక్షేమం కంటే ఆయుధ సంపత్తి వైపే ఉంటాయనడానికి ఇదే నిదర్శనం.
ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన కోణం ఉంది. ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసులను ఉసిగొల్పినా, ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వలేదు. మన దేశాల మాదిరిగా విచక్షణా రహితంగా తూటాలు పేల్చడం, పెల్లెట్ గన్లు వాడడం, నాయకులను అక్రమ చట్టాల కింద అరెస్టు చేసి జైళ్లలో కుక్కడం అక్కడ జరగలేదు. అయినప్పటికీ, అణచివేత ఎక్కడ ఉన్నా అది ప్రమాదకరమే. అక్టోబర్ 7న ప్రధాని లేకూర్నో స్వయంగా యువత ఆగ్రహం “కారణం లేకుండా ఆగ్రహం లేదు” అని అంగీకరించారంటే, సమస్య తీవ్రతను వారు గ్రహించారనే అనుకోవాలి. అయితే, ఆచరణలో మాత్రం సమస్యలను నవంబర్ బడ్జెట్ చర్చలకు వాయిదా వేసి కాలయాపన చేయడం పాలకుల నైజాన్ని వెల్లడిస్తోంది.
మన దేశంపై ప్రభావం – పాలకుల ఆత్మపరిశీలన
ఫ్రాన్స్ పరిణామాలు భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మన దేశంలో విద్యారంగం ఎంత దయనీయ స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూతపడుతున్న బడులు, ఉపాధ్యాయులు లేని కాలేజీలు, లీకవుతున్న ప్రశ్నాపత్రాలు, చదువు పూర్తి కాగానే నిరుద్యోగంతో కుమిలిపోతున్న యువత మన కళ్ల ముందే కనిపిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు నిరసన తెలిపితే వారిని దేశద్రోహులుగా చిత్రించడం పరిపాటిగా మారింది. తాజాగా కేంద్ర మంత్రి రద్దు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, విదేశీ ఉద్యమాలను బూచిగా చూపి దేశంలోని ప్రజాస్వామ్య గొంతుకలను నొక్కేయాలని పాలకుల ఎలా చూస్తున్నారో అర్థమవుతుంది.
“భారతదేశం బంగ్లాదేశ్ కాదు, ఫ్రాన్స్ అంతకంటే కాదు” అని కేంద్ర మంత్రి అనడంలో ఒక స్పష్టత ఉండవచ్చు గాక, కానీ భారతదేశంలోని యువతకు కావలసింది హెచ్చరికలు కాదు; వారి భవిష్యత్తుకు భరోసా. పాలకులు ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం అధికార రాజకీయాలు మరియు కార్పొరేట్ ప్రయోజనాల కోసం పావులు కదిలిస్తే… ఫ్రాన్స్ రచ్చకెక్కినట్లే రేపు ఏ దేశమైనా రోడ్డెక్కక తప్పదు. చరిత్ర ఎవరికోసమూ ఆగదు, ప్రజల చైతన్యం ఎప్పుడూ శాశ్వతమే!
