ముహమ్మద్ ముజాహిద్…✍️
మనది విచిత్రమైన దేశం…
పేదవాడి పళ్ళెం కంటే.. ధనవంతుడి షాంపూలోనే ఎక్కువ పోషకాలు ఉంటున్న దయనీయమైన స్థితిలో మనం జీవిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి.. మన షాంపూలో ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, మాయిశ్చరైజర్లో ప్రొటీన్లు నిండున్నాయి, మనం వాడే క్రీములలో విటమిన్లు కొలువుదీరాయి. అంటే.. జుట్టుకు పోషకాలు కావాలి, చర్మానికి విటమిన్లు కావాలి, మరి రెక్కలు ముగించి చెమటోడ్చే ఆ పేదవాడి పళ్ళేనికి?
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) తాజా నివేదిక దేశంలో తిండి కోసం, పోషకాహారం కోసం సాగుతున్న అదృశ్య యుద్ధాన్ని కళ్లకు కడుతున్నది. ప్రపంచంలోని 122 దేశాల జాబితాలో భారతదేశం 100వ స్థానంలో నిలిచిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశం GHI స్కోరు 24.1గా నమోదై, ‘సీరియస్’ అనగా తీవ్రమైన ఆకలి కేటగిరీలో కొనసాగుతున్నది. కేవలం అంకెలు, ర్యాంకింగ్‌లతో ఈ దుస్థితిని కొలవలేం.
మన దేశంలో నేటికీ దాదాపు 9.8 శాతం జనాభా అర్ధాకలితో అలమటిస్తున్నది. ఇక ఐదేండ్లలోపు చిన్నారుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. దాదాపు 29.3 శాతం మంది పిల్లలు ‘స్టంటెడ్’ (దీర్ఘకాలిక పోషకాహార లోపంతో ఎత్తు కుంటుపడిన వారు)గా ఉంటే, 19 శాతం మంది ‘వెస్టెడ్’ (ఎత్తుకు తగిన బరువు లేని వారు) జాబితాలో మగ్గుతున్నారు.
ఈ గణాంకాలను కేవలం ఏదో ఒక ఎకనామిక్ రిపోర్ట్‌లా చూడకండి. నిత్యం కష్టాలతో పోరాడే ఒక అభాగ్యుడి చిన్నారి రూపంలో చూడండి. ఆ పసివాడికి ‘పాలు’ అంటే ఏవో టీవీల్లో కనిపించే వాణిజ్య ప్రకటనల వస్తువు కాదు.. తన అరిగే కడుపునకు, ఎదిగే శరీరానికి అందిన ప్రాణాధార అవసరం. ఒక తల్లి తన బిడ్డ కంచంలో కమ్మని పాలు, పప్పు, పండ్లు వడ్డించాలని కలలు కంటుంది. కానీ, రోజూ తన బిడ్డ ఆకలి కేకలను, తన చిరిగిపోయిన జేబును బేరీజు వేసుకుంటూ నానా తంటాలు పడుతోంది.
ఇదే కదా నేటి సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద వైరుధ్యం
మనం ఎంతటి మార్కెట్ శకంలో బతుకుతున్నాం? బ్యూటీ న్యూట్రిషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను, హ్యూమన్ న్యూట్రిషన్‌కు కూడా ఇస్తున్నామా? ఇక్కడ ప్రశ్న కేవలం షాంపూ సీసాల గురించో, ఫ్యాషన్ క్రీముల గురించో కాదు. ఎదుగుదల లేక అలమటిస్తున్న ఆ పసిబిడ్డల భవిష్యత్తు గురించి. సంపన్న వర్గాలకు పండగలాంటి భోజనం.. పేదోడికి పూట గడవని దైనీయ పరిస్థితి మారనంతవరకు ఏ అభివృద్ధి నివేదికకూ సార్థకత ఉండదు.
మనం టెక్నాలజీలో పరుగులు పెడుతున్నాం. జాబిల్లిపై అడుగుపెట్టాం. కానీ, ఆ సాంకేతిక పురోగతి ఫలాలు ప్రతి పేదవాడి గడపకూ, ప్రతి చిన్నారి పళ్ళేనికి చేరాయా? దేశ ప్రగతిని కేవలం జీడీపీ (GDP) వృద్ధి రేట్లతోనో, ఆకాశాన్ని తాకే గ్యాలరీలతోనో అంచనా వేయలేం. మన దేశ భవిష్యత్తు అయిన ప్రతి పౌరుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఎదుగుతున్నాడా లేదా అనేదే అసలైన కొలమానం.
మనం ‘విశ్వగురు’ కావాలని కలలు కంటున్నాం.. అది హర్షణీయమే. కానీ, ఆ స్వప్న సౌధానికి గట్టి పునాది కేవలం బడా ఆర్థిక వ్యవస్థలు కావు; ఆకలి లేని, ఆరోగ్యకరమైన పౌరులే ఆ బలం. చంద్రుడిని అందుకోవడం మన శాస్త్రసాంకేతిక విజయ నిదర్శనం కావచ్చు, కానీ ప్రతి బిడ్డ కంచంలోకి ఆకలి తీర్చే పోషణను చేరవేయడం మన తొలి నైతిక బాధ్యత.
ఏ రోజైతే పేదవాడి పళ్ళెంలో కంచం నిండా పోషకాహారం ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరుతుందో.. ఆనాడు మన దేశ ప్రగతి కేవలం ఎర్రకోట ప్రకటనల్లోనూ, ప్రకటనల బిల్ బోర్డులపైనే ఉండదు; అది దేశంలోని ప్రతి బిడ్డ నిండు నవ్వులో, ప్రతి అభాగ్యుడి సంపూర్ణ ఆరోగ్యంలో ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తుంది.
