న్యూఢిల్లీ: దేశంలోకి జరిగే అక్రమ చొరబాట్లను నిరోధించాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వ శాఖదేనని జమియత్ ఉలమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ అసద్ మదానీ స్పష్టం చేశారు. హర్యానాలోని నూహ్‌లో జరిగిన జమియత్ గవర్నింగ్ కౌన్సిల్ రెండు రోజుల సమావేశంలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ సమావేశంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛ, మైనారిటీలకు సంబంధించిన వివిధ సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
భారతదేశంలో ఏ విదేశీ పౌరుడైనా అక్రమంగా నివసించడాన్ని తాము సమర్థించబోమని, అయితే దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను ఆపడం పూర్తిగా హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని మదానీ పేర్కొన్నారు. హోం మంత్రి అమిత్ షా దీనిని అడ్డుకోవడంలో ఉద్దేశపూర్వకంగా విఫలమైతే, ఆయనే “దేశ ద్రోహి” అవుతారని వ్యాఖ్యానించారు
అక్రమ చొరబాట్లను నిరోధించడంలో ప్రభుత్వ యంత్రాంగం లేదా మంత్రిత్వ శాఖ వైఫల్యాలను ప్రశ్నించకుండా, ఈ అంశాన్ని సాకుగా చూపుతూ ముస్లింలను రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
దేశంలో ముస్లింల నాభా పెరుగుదలపై జరుగుతున్న ప్రచారాలను, డెమోగ్రాఫిక్ జిహాద్ ఆరోపణలను జమాయత్ గవర్నింగ్ కౌన్సిల్ తోసిపుచ్చింది. జనాభా మార్పులపై వాస్తవాలను రిశీలించడానికి స్వత్రంత అంతర్జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జనాభా గణన డేటా, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS), ఇతర శాస్త్రీయ ఆధారాలను ఉటంకిస్తూ, ముస్లిం జనాభా దశాబ్దపు వృద్ధి రేటు 1981–1991 మధ్య 32.9 శాతం నుండి 2001–2011 మధ్య 24.7 శాతానికి తగ్గిందని తీర్మానం ఎత్తి చూపింది. జనాభా మార్పులను అక్రమ చొరబాటుకు ఆపాదించడమో లేదా మతపరమైన భద్రతా కథనంగా మార్చడమో కాకుండా, సామాజిక, విద్యా మరియు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పరిశీలించాలని జమాయతే ఉలేమా పాలకమండలి పేర్కొంది.
ఈమేరకు మే 26న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి జనాభా కమిటీ కూర్పును, దాని విధివిధానాల వెనుక ఉన్న అంచనాలను కూడా తిరస్కరించింది. అక్రమ చొరబాటు కారణంగా జనాభా మార్పులు చోటుచేసుకుంటున్నాయనే ప్రాతిపదికన ఈ కమిటీని ఏర్పాటు చేశారని, ఇందులో ఒక్క నిపుణుడైన జనాభా శాస్త్రవేత్త కూడా లేరని తీర్మానం పేర్కొంది.
కమిటీ వైఖరి పక్షపాతంతో కూడుకున్నదని, ప్రాథమికంగా అశాస్త్రీయమైనదని అభివర్ణిస్తూ, మైనారిటీలు, అణగారిన వర్గాలు, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా ఇది ఒక కుట్ర అని జమాత్ అభివర్ణించింది. వలసలు, విద్య, ఉపాధి, సామాజిక-ఆర్థిక పరిస్థితులతో సహా జనాభా మార్పును ప్రభావితం చేసే అన్ని అంశాలను శాస్త్రీయంగా పరిశీలించడానికి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నిపుణులతో కూడిన ఒక స్వతంత్ర మరియు నిష్పక్షపాత కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జమాయత్ గవర్నింగ్ కౌన్సిల్ డిమాండ్ చేసింది.
అంతేకాదు యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ముస్లింల మతస్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను దెబ్బతీసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

