హైదరాబాద్: హైటెక్స్ (HICC) వేదికగా రెండో విడత ‘భారత్ సమ్మిట్-2026’ ఘనంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండవ భారత్ సదస్సుకు హైదరాబాద్ నగరం రెండురోజులపాటు ఆతిథ్యం ఇస్తోంది. రెండవ రోజు రాహుల్ గాంధీ రాక ఈ సదస్సుకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ సదస్సుకు, దాదాపు 70 దేశాల నుండి సుమారు 1,000 మంది ప్రతినిధులు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు హాజరయ్యారు. ‘ఫోర్జింగ్ ఏ న్యూ వరల్డ్’ (Forging a New World) నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో కృత్రిమ మేధస్సు (AI), వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయాలు, బహుళపాక్షిక సంస్థలు, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై ఏడు అంతర్జాతీయ ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ, ఆర్థిక విధానాలపై కూడా చర్చలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ప్యానెల్ చర్చ 90 నిమిషాల పాటు కొనసాగనుందని భారత్ సమ్మిట్ నిర్వాహకులు తెలిపారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ, శనివారం నాడు ఈ సదస్సులో ప్రసంగించడంతో పాటు, నగరంలో జరిగే గిగ్ వర్కర్ల సమావేశానికి కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలోని సుమారు ఆరు లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమ చర్యలను ఆయన ప్రకటించనున్నారు. ఆయన పర్యటన ఇప్పటికే రాజకీయ దుమారాన్ని రేపింది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నల్లజెండా నిరసన చేపడతామని హెచ్చరించడంతో పాటు, ఈ కార్యక్రమాన్ని “భారత్ వ్యతిరేక సదస్సు”గా అభివర్ణించారు.
కాగా, భారత్ సమిట్‌పై రాజకీయం చేయవద్దని, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమానికి కేంద్రం సైతం అనుమతి ఇచ్చిందని, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇలాంటి సమ్మిట్‌లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పాశ్చాత్య దేశాల్లో రాజకీయ, సామాజికంగా వస్తున్న పరిణామాలు, అలాగే ఏఐ, ఎల్నినో వంటి అంశాలపైనా ఈ సదస్సులో చర్చలు జరుగుతాయని కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు.
