ప్రగతిశీల సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర
వ్యక్తిగత మార్పుతోనే సామాజిక మార్పు సాధ్యం
హైదరాబాద్‌లో ఐవైఎం తెలంగాణ రాష్ట్రస్థాయి యువజన సదస్సు
హైదరాబాద్: సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే ముందుగా ప్రతి వ్యక్తిలో మార్పు రావాలని జమాతే ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్. అమీన్ హసన్ అన్నారు. నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో కూడిన యువతే ప్రగతిశీల సమాజ నిర్మాణానికి చోదకశక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఐడియల్ యూత్ మూవ్‌మెంట్ (ఐవైఎం) తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ రోడ్డులో వాదీ-ఎ-హుదా, జామియా దారుల్ హుదా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి యువజన సదస్సు నిర్వహించారు. ‘చేంజ్’ ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత హాజరయ్యారు.
ఈ సందర్భంగా ‘మార్పు వ్యక్తి నుంచే ప్రారంభమవుతుంది’ అనే అంశంపై అమీన్ హసన్ ప్రసంగించారు. వ్యక్తిగత సంస్కరణ ద్వారానే విస్తృత సామాజిక మార్పునకు పునాది పడుతుందని వివరించారు. యువత ఆదర్శాలను మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టాలని, సమాజ సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
సదస్సులో నిర్వహించిన తొలి సెషన్‌లో ‘బాధ్యతాయుతమైన, చైతన్యవంతమైన యువత నిర్మాణం’ అంశంపై చర్చించారు. ఐవైఎం తెలంగాణ రాష్ట్ర యువజన సదస్సు ప్రధాన నిర్వాహకుడు సయ్యద్ ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ ‘ఆలోచన నుంచి ఆచరణ వరకు’ అనే అంశంపై మాట్లాడారు. జాతీయ యువజన సమన్వయకర్త మసీహ్-ఉజ్-జమాన్ చైతన్యవంతమైన యువజన సంస్థల ఆవశ్యకతను వివరించారు.
రెండో సెషన్‌లో ‘ప్రగతిశీల సమాజం కోసం యువత’ అంశంపై ప్రసంగాలు జరిగాయి. జమాతే ఇస్లామీ హింద్ మహారాష్ట్ర సభ్యుడు మహమ్మద్ అజరుద్దీన్ యువత మార్పునకు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు జైన్-ఉల్-పాషా తెలుగులో ప్రసంగించారు. ఐవైఎం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ఇషాక్ జిల్లా కమిటీల ఏర్పాటు, యువత ప్రతిజ్ఞ తదితర అంశాలను వివరించారు.
ముగింపు కార్యక్రమంలో మహమ్మద్ అజరుద్దీన్ అధ్యక్షోపన్యాసం చేశారు. యువత సామాజిక బాధ్యతలను గుర్తించి నిర్మాణాత్మక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.నైతిక విలువలు, క్రమశిక్షణ, సేవాభావంతో కూడిన బాధ్యతాయుతమైన యువ పౌరులను తీర్చిదిద్దడం, వ్యక్తిగత మార్పు ద్వారా సమాజ అభివృద్ధికి దోహదపడటం సదస్సు ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
