హైదరాబాద్: దేశవ్యాప్తంగా 2027లో జరగనున్న జాతీయ జనాభా లెక్కలలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోసం ప్రత్యేక గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారిక తీర్మానాన్ని ఆమోదింపజేశారు.
ప్రధానికి లేఖ రాయాలని సూచన...జనగణనలో ఓబీసీల లెక్కలను తప్పనిసరిగా చేర్చాలని నొక్కి చెప్పిన సీఎం, ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు సూచించారు. తెలంగాణకు కొత్త ఏఐసీసీ ఇన్చార్జ్గా నియమితులైన బి.ఎం. సందీప్ తొలిసారిగా హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు సీఎం ఘన స్వాగతం పలికి, ఈ నియామకానికి కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. గత 100 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన నిర్వహించి చరిత్ర సృష్టించిందని ఆయన గుర్తుచేశారు.
సంక్రాంతి తర్వాత ఐదు నెలల పాటు ‘ప్రజా బలం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని, ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులందరూ ప్రతి గ్రామాన్ని సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాయకులందరికీ ఒక పనిని అప్పగిస్తామని, నిధుల కొరత లేకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు ఇప్పటికే మంచి పదవులు ఇచ్చామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారుల సంఖ్య ఇప్పటికే గణనీయంగా పెరిగిన సంగతి విధితమే.


