న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన తల్లిదండ్రుల సంబంధం గురించి చేసిన వ్యాఖ్యలపై వచ్చిన వ్యతిరేకతను కాంగ్రెస్… బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విస్తృత రాజకీయ దాడిగా మలుచుకుంది. వ్యక్తిగత విమర్శలను తిప్పికొడుతూ, భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల ఆధారంగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు.
సోనియా గాంధీ ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా తన తల్లిదండ్రుల మధ్య ఉన్న అనురాగం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, మద్దతుదారుల నుంచి ఎగతాళి ఎదురైంది. దీనికి స్పందనగా నవంబర్ 23న సోషల్ మీడియాలో ఆయన హిందూ ఆధ్యాత్మిక, శిల్పకళా సంప్రదాయాలకు చెందిన చిత్రాలను పంచుకున్నారు. వీటిలో ఎలిఫెంటా గుహలలోని శివపార్వతుల కలయిక అయిన అర్ధనారీశ్వరుని శిల్పం కూడా ఉంది.
భారత ఆధ్యాత్మిక, మత సంప్రదాయాలను ఎంత లోతుగా అన్వేషిస్తే, బీజేపీ-ఆర్ఎస్ఎస్లు ‘మన ఆధ్యాత్మిక, మత సంప్రదాయాలపై ఏమాత్రం అవగాహన లేని మొరటు, దురాశపరులైన, కులతత్వ పురుషాహంకారులు’ అనే విషయం అంత స్పష్టంగా అర్థమవుతోందని రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. స్త్రీ, పురుష తత్వాల సమైక్యతను చాటే అర్ధనారీశ్వర రూపం ద్వారా, బీజేపీ-ఆర్ఎస్ఎస్ల పితృస్వామ్య ధోరణిని ఆయన ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా కూడా విమర్శలు సంధించారు. ప్రేమ, ఆప్యాయత, సాన్నిహిత్యాలను మన సంప్రదాయాలు, వాస్తుశిల్పం ఎన్నడూ తప్పుబట్టలేదని, వాటిని సామరస్యంగానే చూశాయని అన్నారు. భారత నాగరికత వైవిధ్యానికి ఆర్ఎస్ఎస్-బీజేపీల దృక్పథం దూరంగా ఉందని విమర్శించారు.
మహిళలను చిన్నచూపు చూసే, పురుషాధిక్యతను నెత్తిన రుద్దే ధోరణిని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తున్నాయని ఖేరా ఆరోపించారు. అదే సమయంలో, విషపూరిత పురుషాహంకారం పురుషులకూ హాని చేస్తోందని అన్నారు. భావోద్వేగాలను, ఆప్యాయతను, బలహీనతను వ్యక్తపరిచే స్వేచ్ఛను అది లాగేసుకుంటోందని, తద్వారా ‘భావోద్వేగ, మేధోపరమైన ఖైదు’ ఏర్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
మొత్తంగా రాహుల్ గాంధీ తనపై వస్తున్న వ్యక్తిగత దాడుల నుంచి చర్చను మళ్లించి—ప్రేమ, ఆత్మీయత, సామాజిక విలువలు, భారతీయ సంప్రదాయాల అసలు అర్థం చుట్టూ విస్తృత రాజకీయ, సైద్ధాంతిక చర్చను లేవనెత్తడం ఆసక్తికరంగా మారింది.

