లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలో ఆగ్రాలో జరిగిన బహిరంగ సభలో బీఎస్పీ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్ చేసిన ప్రసంగం రాష్ట్రంలోని పాలనా తీరు, సామాజిక ప్రాతినిధ్యం, ప్రజా సమస్యలపై తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న అభివృద్ధి కథనాలను సవాలు చేస్తూ, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచే ప్రయత్నం ఆయన చేశారు.
ఆకాశ్ ఆనంద్ తన ప్రసంగంలో ప్రధానంగా ఎత్తిచూపిన అంశం ప్రభుత్వ ఖర్చుల ప్రాధాన్యత. ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన, సురక్షితమైన, విద్యావంతులున్న రాష్ట్రంగా చిత్రీకరించుకోవడం కోసం ప్రభుత్వం ప్రకటనల రూపంలో రూ. 7,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు.
అయితే, ఈ ప్రచార ఆర్భాటం క్షేత్రస్థాయిలోని ప్రజల కష్టాలను కప్పిపుచ్చలేకపోతోందని విమర్శించారు. తాము అసాధ్యమైన హామీలేమీ కోరడం లేదని, కేవలం నాణ్యమైన విద్య, అందరికీ భద్రత, ప్రతి చేతికి ఉపాధి వంటి ప్రాథమిక అవసరాలనే డిమాండ్ చేస్తున్నామని స్పష్టం బీఎస్పీ నేత చేశారు.
విద్య, ఉపాధి, శాంతిభద్రతల రంగాల్లోని లోపాలను వివరిస్తూ ఆయన పలు గణాంకాలు, అంశాలను ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల మూసివేత లేదా విలీనం వల్ల చిన్నారులు చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, రెండు కోట్లకు పైగా యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారని, తరచూ జరుగుతున్న పరీక్ష పత్రాల లీకేజీలు యువత భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్నాయని పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికలను ఉటంకిస్తూ, హత్యలు, మహిళలపై నేరాల విషయంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఆరోపిస్తూ, ప్రభుత్వ ‘డబుల్ ఇంజిన్’ నినాదాన్ని ఎద్దేవా చేశారు.
రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం అంశంపై కూడా ఆకాశ్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌లను కొనసాగిస్తున్న తీరును ప్రస్తావిస్తూ, వేర్వేరు సామాజిక వర్గాల నుంచి నేతలను నియమించినంత మాత్రాన అది నిజమైన సాధికారత కాదని విమర్శించారు.
ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉందని చూపించుకోవడానికి వారిని ‘షోపీస్‌లు’గా మాత్రమే ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కలేదని ఎత్తిచూపారు. అలాగే, 2014 నాటి నినాదాలను గుర్తుచేస్తూ, ధరల పెరుగుదల, ఎల్‌పీజీ సిలిండర్, పెట్రోల్ ధరల భారం, రూపాయి విలువ క్షీణత వంటి ఆర్థిక అంశాలపైనా ఆయన ప్రశ్నలు సంధించారు.
ఎన్నికల సమయంలో బయటి ప్రాంతాల నేతలు, మత సంస్థల ప్రతినిధులు, ప్రత్యర్థి పార్టీల నేతలు ఓట్ల కోసం ఆగ్రాకు వస్తారని పరోక్షంగా విమర్శించిన ఆకాశ్ ఆనంద్, కార్యకర్తలు మాయావతి సందేశాన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
2027 ఎన్నికల్లో బీఎస్పీ గుర్తు అయిన ‘ఏనుగు’కు ఓటు వేయడం ద్వారానే ప్రజలు తమ లెక్క తేల్చుకోవాలని బీఎస్పీ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్ కోరారు. మొత్తంగా, ప్రచార హోరుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి మధ్య ఉన్న అంతరాన్ని ఎత్తిచూపుతూ, భవిష్యత్ ఎన్నికలకు బీఎస్పీ తన రాజకీయ స్వరాన్ని స్పష్టంగా వినిపించింది.
