జెరూసలెం: ఇటీవల మధ్యవర్తిత్వ మార్పిడి ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ విడుదల చేసిన వందమందికి పైగా పాలస్తీనియన్ ఖైదీలు తమ బంధువులను కలుసుకునే అవకాశం ఉండదు. వారు స్వదేశానికి తిరిగి రారని, వారికి ఇజ్రాయెల్ ప్రవాస శిక్ష విధించిందని తెలుసుకున్న తర్వాత వారి వేదన వర్ణనాతీతంగా ఉంది.
పాలస్తీనా ఖైదీల మీడియా కార్యాలయం ప్రకారం, సోమవారం విడుదలైన సమూహంలో కనీసం 154 మంది విముక్తి పొందిన పాలస్తీనియన్లను విదేశాలకు బహిష్కరించనున్నారు. హమాస్ విడుదల చేసిన 20 మంది ఇజ్రాయెల్ బందీలకు బదులుగా… గాజా వివాదంలో నిర్బంధించిన 1,700 మందితో పాటు, 250 మంది దోషులుగా నిర్ధారించిన ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.
ప్రవాస శిక్ష విధించిన పాలస్తీనా ఖైదీలకు ఖచ్చితంగా ఏదేశాలకు పంపిస్తారో నిర్ధారించనప్పటికీ, గతంలో విడుదలైన ఖైదీలను ఈజిప్ట్, ట్యునీషియా, అల్జీరియా, టర్కీ దేశాలకు పంపారు.
కాగా, మానవ హక్కుల పరిశీలకులు, పాలస్తీనా అధికారులు బహిష్కరణలను పౌరసత్వ హక్కుల ఉల్లంఘన, రాజకీయ అణచివేత చర్యగా ఖండించారు.
“ఇది చట్టవిరుద్ధమని చెప్పకుండానే తెలుస్తుంది,” అని దోహా ఇన్స్టిట్యూట్లో అసోసియేట్ ప్రొఫెసర్ టామర్ కార్మౌట్ అన్నారు. “వీరు పాలస్తీనా పౌరులు. వారికి వేరే పౌరసత్వం లేదు. వారు ఒక చిన్న జైలు నుండి బయటకు వచ్చారు కానీ వారి సమాజానికి దూరంగా మరో పెద్ద జైలుకు, కొత్త దేశాలకు పంపిస్తున్నారు, అక్కడ వారు ఆంక్షలను ఎదుర్కోక తప్పదు. ఇది అమానుషం అని ఆయన అన్నారు.”
డిసెంబర్ 2022లో అరెస్టు అయి జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రముఖుల్లో ఒకరైన ముహమ్మద్ ఇమ్రాన్ బంధువులు, అతను స్వదేశానికి తిరిగి వస్తాడని మొదట చెప్పారని, అయితే ప్రవాస శిక్ష విధించిన వారిలో అతను కూడా ఉన్నాడని తెలుసుకున్నారని చెప్పారు. ఈమేరకు అతని సోదరుడు రయీద్ ఇమ్రాన్ విలేకరులతో మాట్లాడుతూ… “ఈరోజు వార్త ఒక షాక్, కానీ మేము ఇంకా వేచి ఉన్నాము. బహుశా మనం అతన్ని ఎలాగైనా చూడగలం. ఊరట కలిగించే విషయం ఏమిటంటే అతను ఇక్కడ లేదా విదేశాలలో విడుదల అవుతాడు.”
బలవంతపు బహిష్కరణ… భావోద్వేగ ఇబ్బందులను లేవనెత్తుతుంది. ఇజ్రాయెల్ కఠినమైన నియంత్రణల కారణంగా, చాలా మంది బహిష్కృత ఖైదీలు తమ కుటుంబాలను సంప్రదించలేరు. అల్ జజీరాలోని ఒక నివేదిక ప్రకారం, కుటుంబాలు వారిని మళ్లీ ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేమని భయపడుతున్నాయి.
పరిశీలకులు కూడా బహిష్కరణ విధానాన్ని రాజకీయ ప్రభావాన్ని బలహీనపరిచే ప్రయత్నంగా చూస్తున్నారు. “బహిష్కరణ అంటే వారి రాజకీయ భవిష్యత్తు ముగింపు. వారు వెళ్ళే దేశాలలో, వారు తీవ్ర ఆంక్షలను ఎదుర్కొంటారు. సంఘర్షణకు సంబంధించిన ఏ రంగంలోనూ చురుకుగా ఉండలేరు” అని దోహా ఇన్స్టిట్యూట్లో అసోసియేట్ ప్రొఫెసర్ కార్మౌట్ అన్నారు. ఈ అసమానతను “ద్వంద్వ ప్రమాణాలు, కపటత్వం”గా ఆయన అభివర్ణించారు. మరోవంక ఇజ్రాయెల్ బందీలు స్వదేశంలో తమ జీవితాలను తిరిగి ప్రారంభించవచ్చు.
ఖైదీల మార్పిడి అన్నది అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ విడుదల దౌత్య విజయంగా ప్రశంసలకు నోచుకుంది, కానీ మానవ హక్కుల సంఘాలు, బహిష్కృత కుటుంబాల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి.


