న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఎన్నికల పోటీ రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇండియా కూటమికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దాదాపు 15 ర్యాలీలలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ ప్రక్రియ చేయించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీహార్‌లో మూడు ర్యాలీలతో పాటు కొన్ని విలేకరుల సమావేశాలను కూడా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
రాహుల్ గాంధీ బుధవారం ముజఫర్‌పూర్, దర్భంగాలో రెండు ర్యాలీలతో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం వయనాడ్‌లో ఉన్న ప్రియాంక గాంధీ ఈ వారం చివర్లో బీహార్‌ను సందర్శించి ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కన్హయ్య కుమార్,స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ సహా పార్టీకి మొత్తం 40 మంది స్టార్ ప్రచారకర్తలు ఉన్నారు.
పార్టీ బీహార్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కృష్ణ, రాష్ట్ర యూనిట్ చీఫ్ రాజేష్ రామ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు కె సి వేణుగోపాల్, భూపేశ్ బాఘెల్, సచిన్ పైలట్, రణదీప్ సుర్జేవాలా, సయ్యద్ నసీర్ హుస్సేన్, అలాగే సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, తారిఖ్ అన్వర్, గౌరవ్ గొగోయ్, మహ్మద్ జావేద్, అఖిలేష్ ప్రసాద్ సింగ్ కూడా స్టార్ క్యాంపైనర్ల జాబితాలో ఉన్నారు.
ఈమేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ మాట్లాడుతూ… “రాహుల్ జీ, తేజస్వి యాదవ్ జీ నాయకత్వంలో సక్రా, దర్భంగాలో జరిగిన మహాఘట్బంధన్ ర్యాలీలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న అవినీతి, మతతత్వ, నేరపూరిత NDA ప్రభుత్వాని వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఒక ఉత్తేజకరమైన ప్రచారానికి దారితీశాయని అన్నారు.”
“రోజులు గడిచేకొద్దీ సమాజంలోని ప్రతి వర్గం నుండి మాకు మరింత మద్దతు లభిస్తోంది. రాబోయే ఎన్నికలలో మేము ఘన విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాము!” అని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అన్నారు. కాగా బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు నవంబర్ 14న వెల్లడవుతాయి.
ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలను ప్రధాన భాగస్వాములుగా ఉన్న ప్రతిపక్ష ఇండియా కూటమి, బీహార్ ఎన్నికలకు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.


