మనీలా: అత్యంత శక్తివంతమైన కల్మేగి తుఫాను ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి విలయం దెబ్బకు114 మంది మరణించగా మరో 127గురు తప్పిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కల్మేగి తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న సెంట్రల్ ప్రావిన్స్ సెబులో చాలా మరణాలు సంభవించాయని, ఆకస్మిక వరదలతో నదులు, ఇతర జలమార్గాలు పొంగిపొర్లాయని పౌర రక్షణ కార్యాలయం డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ బెర్నార్డో రాఫెలిటో అలెజాండ్రో IV నేడు మీడియాకు తెలిపారు.
మంగళవారం దక్షిణ ప్రావిన్స్ అగుసాన్ డెల్ సుర్లో ఫిలిప్పీన్స్ వైమానిక దళ హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించిన వారిలో ఆరుగురు ఉన్నారని అధికారులు తెలిపారు. కల్మేగి తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రావిన్సులకు మానవతా సహాయం అందించడానికి ఈ సిబ్బంది వెళ్తున్నారని సైన్యం తెలిపింది.
బుధవారం మధ్యాహ్నం నాటికి కల్మేగి తుపాను పశ్చిమ పలావాన్ నుండి దక్షిణ చైనా సముద్రంలోకి మారి వియత్నాం వైపు వెళుతున్నట్లు భవిష్య సూచకులు నివేదించారు.
సెబులో పైకప్పుల నుండి రక్షించాల్సిన వ్యక్తుల నుండి ఫిలిప్పీన్ రెడ్ క్రాస్ కు అనేక కాల్స్ వచ్చాయని దాని సెక్రటరీ జనరల్ గ్వెండోలిన్ పాంగ్ మంగళవారం తెలిపారు.
నీట మునగడం వల్ల మరణాలు
సెబులో కనీసం 49 మంది వరదల్లో మునిగిపోయారని, మరికొందరు కొండచరియలు విరిగిపడటం, శిథిలాల కారణంగా మరణించారని, అక్కడ 13 మంది తప్పిపోయినట్లు పౌర రక్షణ కార్యాలయం తెలిపింది. సెబు సమీపంలో ఉన్న నీగ్రోస్ ఆక్సిడెంటల్, నీగ్రోస్ ఓరియంటల్ మధ్య ప్రావిన్సులలో మరో 62 మంది తప్పిపోయినట్లు తెలిపారు. “తుపాను నుంచి రక్షణ కోసం మేము చేయగలిగినదంతా చేసాము కానీ, ఆకస్మిక వరదలతో నష్టాన్ని నివారించలేక పోయామని సెబు గవర్నర్ పమేలా బారికువాట్రో అసోసియేటెడ్ ప్రెస్‌తో టెలిఫోన్ ద్వారా చెప్పారు.
అధిక సంఖ్యలో వాహనాలు నీటమునిగాయి. తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 186 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుపాను కారణంగా దీవుల మధ్య నడిచే నౌకలు, చేపల పడవలు నిలిపివేశారు. 3,500 మందికి పైగా ప్రయాణికులు, ట్రక్ డ్రైవర్లు 100 పోర్టుల్లో ఇరుక్కుపోయారు.
తుఫాను కారణంగా సంభవించిన భారీ వరదలు మంగళవారం సెబు నగరంలోని నదీ తీర నివాస సముదాయాన్ని గుర్తించలేని దృశ్యంగా మార్చాయని, SUVలు కూలిపోవడం, ఇళ్ళు చిందరవందరగా మారాయని స్వచ్ఛంద రక్షకుడైన కలోయ్ రామిరేజ్ అన్నారు.
వరద నీరు కొన్ని నిమిషాల్లోనే తమ ఇళ్ల మొదటి అంతస్తులను ముంచెత్తిందని, భయంతో పై అంతస్తులకు లేదా పైకప్పులకు పరుగులు తీశారని స్థానికులు తెలిపారు.


