న్యూఢిల్లీ: ఎస్‌ఐఆర్ అనేది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి భారత ఎన్నికల సంఘం “దుష్ట” కుట్ర అని కాంగ్రెస్ ఆరోపించింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమయంలో ఈసీ ప్రవర్తన “తీవ్రంగా నిరాశపరిచింది” అని పేర్కొంది. “తాము బిజెపి నీడలో పనిచేయడం లేదని వెంటనే నిరూపించాలని” ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో SIRకి వ్యతిరేకంగా బహిరంగ ర్యాలీని కూడా పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్… SIR కసరత్తు జరుగుతున్న 12 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో సహా పార్టీ అగ్ర నాయకత్వం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం తర్వాత ఖర్గే మాట్లాడుతూ…తమ పార్టీ “ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి నిస్సందేహంగా కట్టుబడి ఉంది” అని అన్నారు. “ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతిన్న సమయంలో, SIR ప్రక్రియతో… ఎన్నికల కమిషన్ ప్రవర్తన తీవ్ర నిరాశపరిచింది. ఇది బిజెపి నీడలో పనిచేయడం లేదని, ఏ పాలక పార్టీకి ఒత్తాసు పలకమని వెంటనే నిరూపించాలి” అని ఆయన అన్నారు.
బిజెపి “ఓటు చోరీ కోసం SIR ప్రక్రియను ఆయుధంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది” అని ఖర్గే ఆరోపించారు. కాగా, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయంగా, సంస్థాగతంగా, న్యాయపరంగా పోరాడతామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘స్వచ్చమైన ఓటర్ల జాబితాను రూపొందించడం ఈసీ విధి. కానీ ఆ సంస్థ.. బాధ్యతను రాజకీయ పార్టీలపై వేసింది. ప్రక్రియను హడావుడిగా చేపట్టింది. అసలైన ఓటర్లను ఈసీ తొలగిస్తోంది’ అని విమర్శించారు.
సమావేశం తర్వాత, వేణుగోపాల్ వచ్చే నెల ప్రారంభంలో జరగనున్న ప్రజా ర్యాలీ గురించి విలేకరులకు తెలిపారు. ఎన్నికల కమిషన్ “దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ఒక దుర్మార్గపు చర్య” అని వేణుగోపాల్ ఆరోపించారు.
“ఖర్గే, రాహుల్- ఈ దుష్ట కుట్ర గురించి పిసిసి చీఫ్‌లను హెచ్చరించారు… ఎన్నికల కమిషన్ ఉద్దేశ్యం ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేయడమే. మేము వీధుల్లోకి వెళ్తున్నాము… కాంగ్రెస్ పార్టీ రాంలీలా మైదానంలో భారీ ర్యాలీని నిర్వహిస్తుంది. ఎన్నికల కమిషన్ బండారాన్ని మళ్ళీ బయటపెడతాము” అని ఆయన అన్నారు.


