Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు…27 మంది పాలస్తీనియన్లు మృతి!

Share It:

జెరూసలెం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ గాజాపై మళ్ళీ దాడులు చేసింది. బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్‌ వైమానిక దళం గాజా స్ట్రిప్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు గాజా డిఫెన్స్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలో 15 మంది, ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో 12 మంది మతి చెందినట్లు హమాస్‌ వెల్లడించింది. కాగా హమాస్‌ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికారులు తెలిపారు. కాగా, సౌదీ క్రౌన్ ప్రిన్స్ వాషింగ్టన్ వెళ్లిన సందర్భంలో ఈ హత్యాకాండ జరగడం గమనార్హం.

కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం… తమ దళాలు ఉపసంహరించుకున్న ప్రాంతాలను ఇజ్రాయెల్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది. ఇజ్రాయెల్ హత్యాకాండకు బలైన వారిలో 17 మంది మహిళలు, పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో అల్-మవాసిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం కూడా ధృవీకరించింది.
పాలస్తీనా ఏజెన్సీ ప్రకారం… పాలస్తీనా భూభాగం ఉత్తరాన ఉన్న గాజా నగరం, దక్షిణ ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ మూడు వేర్వేరు దాడులు నిర్వహించింది.

గాజా నగర ప్రాంతంలో ఇజ్రాయెల్ కనీసం 12 మందిని చంపగా, ఖాన్ యూనిస్‌పై జరిగిన దాడుల్లో మరో 10 మంది మరణించారు. ఇజ్రాయెల్ దళాలు జరిపిన ఈ మూడు దాడులూ ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను, ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్ళిన ప్రాంతాలను వేరు చేసే ఊహాత్మక “ఎల్లో లైన్‌” కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్యులు, సాక్షులు, పాలస్తీనా మీడియా తెలిపింది.

దాడుల్లో ఒకటి జైటౌన్ పరిసరాల్లోని ముస్లిం మత అధికారులకు చెందిన భవనంపై జరిగింది. ఖాన్ యూనిస్ దాడి UN ఆధ్వర్యంలో నడిచే క్లబ్‌పై జరిగింది, ఈ రెండూ నిర్వాసిత పాలస్తీనియన్ కుటుంబాలు ఉండేవే కావడం గమనార్హం

“అత్యవసర సిబ్బంది ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకుతూ, గాయపడిన వారిని తరలిస్తూనే ఉన్నారు… ఎందుకంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది” అని WAFA వార్తా సంస్థ నివేదించింది.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా రాజధానిలో పర్యటిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ఈ మారణహోమం నిర్వహించింది. తన పర్యటన సందర్భంగా, ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రక్షణ,వాణిజ్య చర్చలు జరిపారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు హామీ ఇస్తే ఇజ్రాయెల్‌తో అబ్రహం ఒప్పందాలలో చేరడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.

కాగా, ఇజ్రాయెల్ – హమాస్ మధ్య సంధి ఒప్పందంతో సహా ఏడు నెలల్లో ఏడు ఘర్షణలను ఆపినట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే గాజా, పొరుగున ఉన్న లెబనాన్‌లో ఇజ్రాయెల్ పదే పదే దాడులు చేయడం ట్రంప్ ప్రయత్నాలను క్లిష్టతరం చేస్తోంది.

మరోవంక పాలస్తీనా ప్రతిఘటన సమూహం హమాస్ ఇజ్రాయెల్ దాడులను “ప్రమాదకరమైన తీవ్రత”గా ఖండించింది. వారు సున్నితమైన కాల్పుల విరమణను ప్రమాదంలో పడేశారని హెచ్చరించింది.

“యుద్ధ నేరస్థుడు (ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్) నెతన్యాహు… మా ప్రజలపై మారణహోమాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న ప్రమాదకరమైన తీవ్రతగా మేము దీనిని భావిస్తున్నాము” అని హమాస్ ఒక ప్రకటనలో రాసింది.

అక్టోబర్ 10 కాల్పుల విరమణ తర్వాత గాజా అంతటా ఇజ్రాయెల్ సైన్యం 393 దాడులు నిర్వహించిందని, కనీసం 290 మంది పాలస్తీనియన్లను చంపిందని, దాదాపు 700 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

అక్టోబర్ 29న ఇజ్రాయెల్ 100 మందికి పైగా ప్రజలను చంపిన సందర్భాలు ఉన్నాయి. మొత్తంగా గాజాలో ఇజ్రాయెల్ చేసిన మారణహోమం 69,000 మందికి పైగా పాలస్తీనియన్లను చంపింది. వీరిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉండటం విషాదం. 170,000 మందికి పైగా గాయపడ్డారు. గాజా ఎన్‌క్లేవ్‌ను శిథిలావస్థకు చేర్చారు. కాగా రెండు లక్షలకు పైగానే మరణాలు సంభవించాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇక రెండు సంవత్సరాలకు పైగా జనసమ్మర్థం ఉన్న ఈ చిన్న ప్రాంతంలో జరిగిన ఇజ్రాయెల్ మారణహోమం కారణంగా దాదాపు అందరు పాలస్తీనియన్లు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది, చాలా మంది ఇప్పుడు టెంట్లు, ఇతర ప్రాథమిక ఆశ్రయాలలో నివసిస్తున్నారు.

ఇటీవలి రోజుల్లో పాలస్తీనాలో భారీ వర్షాలు, తుఫానుల కారణంగా వరదలు సంభవించాయి. దీంతో కొన్ని ఆశ్రయాలను ధ్వంసం అయ్యాయి. పరుపులు, దుప్పట్లు తడిసిపోవడంతో పాలస్తీనియన్ల బాధలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ పదేపదే కాల్పుల విరమణను ఉల్లఘించడం కొత్త దుఃఖాన్ని తెచ్చిపెట్టాయి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.