హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న ‘ఫ్యూచర్ సిటీ’లో ఈశాన్య రాష్ట్రాలకు సొంత భవనాలు నిర్మించుకోవడానికి భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ భవనాలు భారతదేశంలోనే మొట్టమొదటి ‘నార్త్-ఈస్ట్ కనెక్ట్’ కేంద్రం అవుతాయని ఆయన అన్నారు.
నిన్న రాత్రి ఇక్కడ జరిగిన ‘తెలంగాణ – నార్త్-ఈస్ట్ కనెక్ట్ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్’లో ఆయన మాట్లాడుతూ… అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు ‘ఫ్యూచర్ సిటీ’లో హాస్టల్ సౌకర్యాలు, ఆహారం, హస్తకళ, సంస్కృతి, కళా ప్రదర్శన కేంద్రాలతో పాటు సొంత భవనాలు ఉంటాయని అన్నారు.
ప్రతి ఈశాన్య రాష్ట్రం తమ సొంత భవనాన్ని నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో మొట్టమొదటి “నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని” ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేందుకు గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ నాయకత్వం వహించాలని సీఎం ప్రత్యేకంగా కోరారు.
ఈశాన్య భారతం అద్భుతమైన పర్యావరణ సంపదతో పాటు గొప్ప సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతమని, అయితే అక్కడ వెలుగులోకి రాని అంశాలు ఇంకా చాలా ఉన్నాయని రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ గుర్తింపు విషయంలో ఈశాన్య రాష్ట్రాలు పడుతున్న కష్టాలను తెలుగు ప్రజలు సులభంగా అర్థం చేసుకుంటారని సీఎం అన్నారు. 1970- 80లలో, ఉత్తరాదివారు దక్షిణ భారతీయులను ‘మద్రాసీలు’ అని పిలిచేవారు. అప్పట్లో తెలుగువారికంటూ ప్రత్యేక గుర్తింపు ఏమీ ఉండేది కాదని సీఎం గుర్తు చేశారు.
“మీరందరూ ఇడ్లీ, సాంబార్ తింటారని వారు చెప్పేవారు. కానీ, మీకు తెలిసినట్లుగా, దక్షిణ భారతదేశం భారత ఆర్థిక వ్యవస్థ, సమాజం, సంస్కృతి, కళలు, సాంకేతికత, విద్య, వ్యాపారం మరియు క్రీడలకు చాలా దోహదపడుతుంది. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, ప్రజలతో మనం బాగా అర్థం చేసుకుని, కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అన్ని రంగాలలో మన దేశానికి మరింత దోహదపడతాయని” ఆయన అన్నారు.
తెలంగాణ.. నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ సంస్కృతుల సంగమం.. సమృద్ధికి సోపానం పేరుతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనా రెడ్డి, అనేక మంది రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


