హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెలలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో 1.66 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్, డిసెంబర్ 14న రెండవ దశ, డిసెంబర్ 17న మూడవ దశ పోలింగ్ జరుగుతుందని ఆమె చెప్పారు.
“మొదటి దశకు నవంబర్ 27 నుండి, రెండవ దశకు నవంబర్ 30న, మూడవ దశకు డిసెంబర్ 3న నామినేషన్లు స్వీకరిస్తామని” ఆమె చెప్పారు.
“ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. తరువాత మధ్యాహ్నం 2 గంటల నుండి లెక్కింపు జరుగుతుంది” అని అధికారి తెలిపారు, “నోటిఫికేషన్ జారీతో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది” అని కూడా అన్నారు.
మొదటి దశకు నామినేషన్లు దాఖలు చేయడానికి నవంబర్ 29, రెండవ దశ డిసెంబర్ 2, మూడవ దశ డిసెంబర్ 5ను చివరి తేదీగా నిర్ణయించారు. నామినేషన్ పత్రాల పరిశీలన నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6 తేదీలలో జరుగుతుంది.
కాగా, గ్రామ పంచాయతీలలో వెనుకబడిన తరగతుల (BC) కు 17.08 శాతం రిజర్వేషన్లు కల్పించింది. మొత్తం 12,735 గ్రామ పంచాయతీలలో, 2,176 BC లకు రిజర్వ్ చేసారు. ఎన్నికలు జరిగే 31 జిల్లాల్లో, సిద్దిపేటలో అత్యధికంగా 26.772 BC రిజర్వేషన్లు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, BCలకు ఏ గ్రామ పంచాయతీ రిజర్వ్ చేయలేదు.
ప్రస్తుతం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల కోసం రీనోటిఫికేషన్ విడుదల చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో ఎన్నికల పరిశీలకులను నియమించామని, ఎన్నికల ఉల్లంఘనలపై వారు ఎప్పటికప్పుడు తమకు నివేదికలు పంపిస్తారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల కోసం ఈసారి కొత్తగా ‘గ్రీవెన్స్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశామని, త్వరలో అందుబాటులోకి తెస్తున్న యాప్ ద్వారా ఫిర్యాదులు, అభ్యంతరాలు వంటివి స్వీకరిస్తామన్నారు. ఈ ఎన్నికల నిమిత్తం ఎస్ఈసీ కార్యాలయంలో 9240021456 నంబర్‌తో కాల్‌సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.


